సెంట్రల్ ప్యారిస్‌లోని డ్రగ్ డీలర్ నుండి కొకైన్ కొనుగోలు చేసినట్లు అనుమానంతో ఆస్ట్రేలియా ఒలింపిక్ ఫీల్డ్ హాకీ ప్లేయర్ టామ్ క్రెయిగ్‌ను ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. 28 ఏళ్ల మిడ్‌ఫీల్డర్ క్రెయిగ్, ప్యారిస్ ఒలింపిక్స్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆదివారం ఆస్ట్రేలియా తరఫున ఆడాడు. ఒక అపార్ట్‌మెంట్ భవనం సమీపంలో కొకైన్ లావాదేవీ జరిగింది.. బుధవారం ఉదయం 00:30 (2230 GMT) సమయంలో అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
క్రెయిగ్ పట్టుబడినప్పుడు అతడి దగ్గర ఒక గ్రాము కొకైన్ ఉంది. బుధవారం తెల్లవారుజామున వరకూ పోలీసు కస్టడీలో ఉన్నాడు. క్రెయిగ్ కు అమ్మిన వ్యక్తి దగ్గర కొకైన్‌తో పాటు 75 ఎక్స్‌టసీ మాత్రలు, సింథటిక్ డ్రగ్స్‌తో పాటు పలు రకాల డ్రగ్స్ ఉన్నాయని తేలింది. అతడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరికినందున, విచారణను ఫ్రెంచ్ పోలీసుల యాంటీ నార్కోటిక్ బ్రిగేడ్‌కు అప్పగించారు. ఆస్ట్రేలియన్ ఒలింపిక్ కమిటీ (AOC) ఆస్ట్రేలియన్ హాకీ జట్టు సభ్యుడు పోలీసు కస్టడీలో ఉన్నాడని ధృవీకరించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తన రోజువారీ విలేకరుల సమావేశంలో ఈ అరెస్టుపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియన్ పురుషుల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్ లో ఓడిపోయింది. నెదర్లాండ్స్‌తో 2-0 తేడాతో పరాజయం పాలయ్యారు.