ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం..రోడ్డు ప్ర‌మాదంలో ఆండ్రూ సైమండ్స్ దుర్మ‌ర‌ణం

Australian Cricket Star Andrew Symonds Dies In Car Crash.ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. మాజీ క్రికెట‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 May 2022 3:22 AM GMT
ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం..రోడ్డు ప్ర‌మాదంలో ఆండ్రూ సైమండ్స్ దుర్మ‌ర‌ణం

ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. మాజీ క్రికెట‌ర్, దిగ్గ‌జ ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ సైమండ్స్ రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందాడు. శ‌నివారం రాత్రి 10.30గంట‌ల స‌మ‌యంలో క్వీన్స్‌లాండ్‌లోని టౌన్ విల్లేలో జ‌రిగిన కారు ప్ర‌మాదంలో సైమండ్స్ క‌న్నుమూసిన‌ట్లు స్థానిక పోలీసులు తెలియ‌జేశారు. వేగంగా వెలుతున్న కారు అదుపుత‌ప్పి బోల్తా కొట్టిన‌ట్లు అక్క‌డి మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో సైమండ్స్ ఒక్క‌డే ఉన్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న వ‌య‌స్సు 46 సంవ‌త్స‌రాలు. సైమండ్స్‌ మృతితో యావత్‌ క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు క్రీడాకారులు సంతాపం తెలియ‌జేశారు. ఆండ్రూ సైమండ్స్ మర‌ణ‌వార్త విని షాక్‌కు గురైన విరాట్ కోహ్లీ సోష‌ల్ మీడియా వేదిక‌గా తన సంతాపాన్ని తెలిపాడు.


1998లో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ అరంగ్రేటం చేశాడు సైమ‌న్స్‌. ఆస్ట్రేలియా జ‌ట్టు త‌రుపున మొత్తం 198 వ‌న్డేలు, 26 టెస్టులకు ప్రాతినిధ్యం వ‌హించాడు. వ‌న్డేల్లో 5,088 ప‌రుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచ‌రీలు, 30 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. బౌలింగ్‌లో 133 వికెట్లు ప‌డ‌గొట్టాడు. టెస్టుల్లో 1,463 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు శ‌త‌కాలు, 10 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. 24 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరుగాంచిన సైమండ్స్ 2003, 2007 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు సైమండ్స్‌ వీడ్కోలు పలికాడు.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్‌)లో కూడా సైమండ్స్ ఆడాడు. తొలి సీజ‌న్‌లో హైద‌రాబాద్ డెక్క‌న్ ఛార్జ‌ర్స్‌కు అనంత‌రం ముంబై ఇండియ‌న్స్‌కు జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. తొలి సీజన్‌లో సైమండ్స్‌ను డెక్కన్ ఛార్జర్స్ రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. రెండు జ‌ట్ల త‌రుపున 974 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, ఐదు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

సైమండ్స్ సహచరులైన జాసన్ గిలెస్పీ, ఆడం గిల్‌క్రిస్ట్, పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తదితరులు ట్వీట్లతో తమ బాధను పంచుకున్నారు. సైమండ్స్ మృతి చెందాడన్న వార్తను నమ్మలేకపోతున్నామని, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.


Next Story