చరిత్ర సృష్టిస్తూ దూసుకుపోతున్న ఆసీస్ మహిళల జట్టు.. ఇన్ని విజయాలా..!

Australia Women's Cricket Team Sets New World Record In ODIs. మెన్స్ క్రికెట్ లో ఒకప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్ల దూకుడును

By Medi Samrat  Published on  4 April 2021 3:30 PM GMT
australia cricket

మెన్స్ క్రికెట్ లో ఒకప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్ల దూకుడును తట్టుకోవడం చాలా కష్టమే..! గత దశాబ్ద కాలంగా వారి దూకుడు బాగా తగ్గింది. ఇతర జట్లు కూడా బాగా మెరుగయ్యాయి. ఇక మహిళల క్రికెట్ లో మాత్రం ఆసీస్ విమెన్స్ టీమ్ జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. తాజాగా వారు సరికొత్త చరిత్ర సృష్టించారు. వ‌న్డేల్లో ఆస్ట్రేలియా మ‌హిళ‌ల క్రికెట్ టీమ్ కొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. ఆస్ట్రేలియా పురుషుల జ‌ట్టు రికార్డును మహిళల టీమ్ తిర‌గ‌రాసింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ద్వారా క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డు న‌మోదైంది. వ‌న్డేల్లో 2003లో రికీ పాంటింగ్ సార‌థ్యంలోని ఆస్ట్రేలియా పురుషుల టీమ్ సృష్టించిన వ‌రుస విజ‌యాల రికార్డును ఆస్ట్రేలియా మ‌హిళ‌ల టీమ్ ఈ విజ‌యం ద్వారాతాజాగా తిర‌గ‌రాసింది.

ఇప్ప‌టి వ‌ర‌కూ 21 వ‌రుస విజ‌యాల‌తో ఆస్ట్రేలియా పురుషుల జ‌ట్టు పేరిట ఈ రికార్డు ఉంది. మహిళల జట్టు వ‌రుస‌గా 22వ విజయం సొంతం చేసుకుంది. చివ‌రిసారి 2017 అక్టోబ‌ర్‌లో ఓ వ‌న్డే మ్యాచ్‌లో ఓడిపోయింది ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఓట‌మన్నదే ఎదురవకుండా దూసుకుపోతోంది. 2018 మార్చిలో ఇండియాపై 3-0 విజ‌యంతో ఆస్ట్రేలియామహిళల జట్టు వరుస విజయాలను సొంతం చేసుకోవడం మొదలైంది. పాకిస్థాన్ (3-0), న్యూజిలాండ్ (3-0), ఇంగ్లండ్ (3-0), వెస్టిండీస్ (3-0), శ్రీలంక (3-0), న్యూజిలాండ్ (3-0)ల‌పై సిరీస్ విజ‌యాలు సాధించారు. ఇప్పుడు అదే న్యూజిలాండ్‌పై మూడు వ‌న్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. మొదటి వన్డేలో న్యూజిలాండ్ మహిళల జట్టు 212 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. ఆస్ట్రేలియా మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మహిళల క్రికెట్ లో ఆసీస్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది.
Next Story
Share it