విశ్వ‌విజేత‌గా ఆస్ట్రేలియా.. ఏడోసారి

Australia win ICC Women's World Cup 2022.ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచక‌ప్-2022 ని ఆస్ట్రేలియా జ‌ట్టు కైవ‌సం చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 April 2022 9:04 AM GMT
విశ్వ‌విజేత‌గా ఆస్ట్రేలియా.. ఏడోసారి

ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచక‌ప్-2022 ని ఆస్ట్రేలియా జ‌ట్టు కైవ‌సం చేసుకుంది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చ‌ర్చ్ వేదిక‌గా ఆదివారం ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో 71 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి రికార్డు స్థాయిలో ఏడోసారి జగజ్జేతగా నిలిచింది. ఇక ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోక‌పోవ‌డం విశేషం.

ఆస్ట్రేలియా నిర్థేశించిన 357 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని చేదించే క్ర‌మంలో ఇంగ్లాండ్ 43.4 ఓవ‌ర్ల‌లో 285 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓపెన‌ర్లు డానియెల్లి(4), టామీ బీమౌంట్‌(27) శుభారంభాన్ని ఇవ్వ‌లేక‌పోయారు. ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికీ మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ న‌టాలీ సీవ‌ర్ (148 నాటౌట్; 121 బంతుల్లో 15 పోర్లు, 1 సిక్స్‌) భారీ శ‌త‌కంతో పోరాడింది. అయితే.. ఆమెకు స‌హ‌క‌రించే వారే క‌రువ‌య్యారు. ఆసీస్ బౌల‌ర్లు క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు తీయ‌డంతో ఇంగ్లాండ్ పోటిలో నిలవ‌లేక‌పోయింది.

అంత‌క‌ముందు.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల నష్టానికి 356 పరుగు చేసింది. ఓపెన‌ర్లు హేలీ(170 ; 138 బంతుల్లో 26 పోర్లు), హేన్స్‌(68; 93 బంతుల్లో 7 పోర్లు) తొలి వికెట్‌కు 160 ప‌రుగుల జోడించి శుభారంభాన్ని అందించారు. వీర‌ద్ద‌రూ ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. ముఖ్యంగా హేలీ త‌న దైన షాట్ల‌తో అల‌రించింది. హేన్స్ ఔటైనా.. వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ మూనీ(62; 47 బంతుల్లో 8పోర్లు) తోడుగా చెల‌రేగిపోయింది. దీంతో ఇంగ్లాండ్ ముందు భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది.


Next Story
Share it