68 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ఇంగ్లాండ్‌.. యాషెస్‌ సిరీస్‌ ఆస్ట్రేలియాదే

Australia thrash England by an innings to win third Test.మెల్‌బోర్న్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Dec 2021 3:32 AM GMT
68 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ఇంగ్లాండ్‌.. యాషెస్‌ సిరీస్‌ ఆస్ట్రేలియాదే

మెల్‌బోర్న్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే ప్ర‌తిష్టాత్మ‌క యాషెస్ సిరీస్‌ను 3-0తో ఆస్ట్రేలియా కైవ‌సం చేసుకుంది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 68ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ 14 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. అరంగ్రేట పేస‌ర్ స్కాట్ బోలాండ్‌(6/7) సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంగ్లాండ్ న‌డ్డి విడిచాడు. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 185 ప‌రుగులు చేయ‌గా.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 267 ప‌రుగులు చేసింది.

అంత‌క‌ముందు ఓవ‌ర్ నైట్ స్కోర్ 31/4 స్కోరుతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొన‌సాగించిన ఇంగ్లాండ్ మ‌రో 37 ప‌రుగులు మాత్ర‌మే జోడించి మిగ‌తా వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ జో రూట్‌(28), బెన్‌స్టోక్స్‌(11) ప‌రుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్‌ బౌలర్లలో స్కాట్‌ బోలాండ్‌ 6 వికెట్లు, స్టార్క్‌ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఇక సిడ్నీ వేదిక‌గా ఇరు జ‌ట్ల మ‌ధ్య నాలుగో టెస్టు జ‌న‌వ‌రి 5న ప్రారంభం కానుంది. క‌నీసం మిగిలిన మ్యాచుల్లో విజ‌యం సాధించి అవ‌మాన భారాన్ని త‌గ్గించుకోవాల‌ని ఇంగ్లాండ్ బావిస్తుండ‌గా.. వైట్‌వాష్ చేయాల‌ని ఆసీస్ ఎదురుచూస్తోంది.

ఇక అరంగ్రేటం మ్యాచ్‌లో మొత్తం ఏడు వికెట్లు తీసి స‌త్తా చాటారు ఆసీస్ పేస‌ర్ బోలాండ్‌. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ మాత్ర‌మే తీసిన బొలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 7 ప‌రుగులే ఇచ్చి 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ్యాచ్ అనంత‌రం బోలాండ్ మాట్లాడుతూ.. త‌న ప్ర‌ద‌ర్శ‌న‌పై చాలా సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు. 'ఇప్ప‌టికీ ఇది క‌ల లాగే అనిపిస్తుంది. దీన్ని ఇంకా నేను న‌మ్మ‌లేక‌పోతున్నా. ఈ రోజు విజ‌యం సాధిస్తామ‌ని తెలుసు. అయితే.. ఇంత త్వ‌ర‌గా గెలుస్తామ‌ని మాత్రం అనుకోలేదు. మ‌ద్ద‌తుగా నిలిచిన అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు' అని బోలాండ్ అన్నాడు.

Next Story