వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత ఐసీసీ ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో.. భారత బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకున్నాడు. ఫైనల్ రెండు ఇన్నింగ్సులలో 89, 46 పరుగులు చేసిన రహానే 37వ స్థానానికి ఎగబాకాడు. 16 నెలల తర్వాత టెస్టు జట్టులోకి తిరిగి వచ్చిన రహానే.. ఫైనల్లో బాగా బ్యాటింగ్ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.
బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో మొదటి మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉన్నారు. మార్నస్ లాబుస్చెన్ మొదటి స్థానంలో, స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో, ట్రావిస్ హెడ్ మూడో స్థానంలో నిలిచారు. 1984 తర్వాత ఒకే దేశానికి చెందిన ముగ్గురు ఆటగాళ్లు టాప్-3లో ఉన్నారు. 1984లో వెస్టిండీస్‌కు చెందిన గోర్డాన్ గ్రీనిడ్జ్ మొదటి స్థానంలో, క్లైవ్ లాయిడ్ రెండో స్థానంలో, లారీ గోమెజ్ మూడో స్థానంలో నిలిచారు.
రహానేతో పాటు శార్దూల్ ఠాకూర్ కూడా తన ర్యాంకింగ్ మెరుగుపరుచుకున్నాడు. ఫైనల్‌లో శార్దూల్ హాఫ్ సెంచరీ చేశాడు. శార్దూల్ ప్రస్తుతం బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 94వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ ఫైనల్ ఆడకపోయినా బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. గాయపడిన జస్ప్రీత్ బుమ్రా రెండు స్థానాలు దిగజారి ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. బుమ్రా చివరిసారిగా 2022 జూలైలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.
కారు ప్రమాదం తర్వాత పునరాగమనం చేయడానికి సిద్ధమవుతున్న రిషబ్ పంత్ టాప్-10లో ఉన్న ఏకైక భారతీయ బ్యాట్స్‌మెన్. పంత్ 10వ స్థానంలో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 12వ స్థానంలో, విరాట్ కోహ్లీ 13వ స్థానంలో ఉన్నారు.