భారత్ ఘోర పరాజయం.. ప్రపంచ టెస్టు చాంపియన్‌గా ఆస్ట్రేలియా

Australia Beat India to win ICC WTC 2023 Title. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌గా నిలవాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది.

By Medi Samrat  Published on  11 Jun 2023 5:29 PM IST
భారత్ ఘోర పరాజయం.. ప్రపంచ టెస్టు చాంపియన్‌గా ఆస్ట్రేలియా

ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌గా నిలవాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. ఓవల్‌లో ఆస్ట్రేలియా జ‌ట్టు 209 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించి.. తొలిసారి టెస్టు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. దీంతో వన్డే, టీ20, టెస్టుల్లో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన తొలి జట్టుగా అవతరించింది. చివరి రోజు భారత్ విజ‌యానికి 280 పరుగులు కావాల్సివుండ‌గా.. బ్యాట్స్‌మెన్ చేతుతెత్తేశారు. గ‌త సంవ‌త్స‌రం కూడా ఇంగ్లండ్‌లో జ‌రిగిన ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్ షిప్ ఫైన‌ల్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది.

చారిత్రాత్మక టెస్టులో నాలుగో రోజు భారత జట్టు 3 వికెట్లకు 164 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 44 పరుగులు చేయగా, అజింక్యా రహానే 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 5వ రోజు ఆట ప్రారంభంలో భారత్ 280 పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి వికెట్‌ విరాట్‌ కోహ్లి రూపంలో పడింది. 49 పరుగుల స్కోరు వద్ద బోలాండ్ వేసిన బంతికి బ‌ల‌య్యాడు. అనంత‌రం రవీంద్ర జడేజా కూడా సున్నాకే ప‌రిమిత‌మ‌య్యాడు. ఆపై స్టార్క్ బౌలింగ్‌లో అజింక్య రహానే క్యాచ్ అవుట్ కావడంతో భార‌త్‌ ఆశలు ఆవిర‌య్యాయి. అనంత‌రం శార్దూల్ ఠాకూర్ ఖాతా తెరవకుండానే పెవిలియ‌న్ చేరాడు. ఉమేష్ యాదవ్ ఒక పరుగు చేసి స్టార్క్ బంతికి క్యారీకి క్యాచ్ ఇచ్చాడు. చివ‌ర‌గా సిరాజ్ కూడా లియాన్ బౌలింగ్‌లో అవుట‌వ్వ‌డంతో ఆస్ట్రేలియా టెస్టు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.


Next Story