అద్భుతం జరగలే.. ఇండోర్‌లో భార‌త్‌కు ప‌రాభ‌వం

ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా విజ‌యం సాధించింది. 75 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోయి చేధించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 March 2023 11:33 AM IST
Border–Gavaskar Trophy, India vs Australia

ఇండోర్ టెస్ట్

రెండో రోజు సాయంత్రానికే దాదాపుగా ఫ‌లితం తేలిపోయింది. అయితే.. నెర్రెలు వాసిన పిచ్‌పై బంతి గింగిరాలు తిరుగుతుండ‌డంతో ఏదైన అద్భుతం జ‌రుగుతుందేమోన‌ని చాలా ఆశ‌గా ఎదురుచూడ‌గా నిరాశే ఎదురైంది. బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ 2023లో ఎట్ట‌కేల‌కు ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఇండోర్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో భార‌త్‌పై ఘ‌న విజ‌యం సాధించింది.

76 పరుగుల స్వల్ప లక్ష్యంతో మూడో రోజు ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని సునాయాసంగా ఛేధించింది. ఓపెన‌ర్ ఉస్మాన్ ఖ‌వాజా(0) తొంద‌ర‌గానే పెవిలియ‌న్‌కు చేరినా వ‌న్ డౌన్ బ్యాట‌ర్ మార్క‌స్ ల‌బుషేన్‌(28 నాటౌట్‌; 58 బంతుల్లో 6 ఫోర్ల‌)తో క‌లిసి ట్రావిస్‌ హెడ్‌ (49 నాటౌట్‌; 53 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్స్‌) జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. ఈ విజ‌యంతో నాలుగు టెస్టు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత ఆధిక్యాన్ని 2-1కి త‌గ్గించింది.

వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్‌లో టీమ్ఇండియా ఫైన‌ల్ చేరుకోవాలంటే నాలుగో టెస్టులో త‌ప్ప‌క విజ‌యం సాధించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య నాలుగో టెస్టు మార్చి 9న ప్రారంభం కానుంది.

Next Story