పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా.. భారత్ కు అవకాశాలు ఉన్నాయి
AUS lead by 296 runs at Stumps. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు పటిష్ట స్థితిలో ఉంది.
By Medi Samrat Published on 10 Jun 2023 7:29 AM IST
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్ 41 పరుగులు, కామెరాన్ గ్రీన్ 7 పరుగులతోనూ ఉన్నారు. టీమిండియా బౌలర్లలో జడేజా 2, సిరాజ్ 1, ఉమేశ్ యాదవ్ 1 వికెట్ తీశారు. ఆసీస్ జట్టులో ఉస్మాన్ ఖవాజా 13, వార్నర్ 1, స్టీవ్ స్మిత్ 34, ట్రావిస్ హెడ్ 18 పరుగులు చేశారు. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 296 పరుగులు కాగా, ఆటకు మరో రెండ్రోజుల సమయం మిగిలింది.
టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులు చేసింది. దాంతో ఆసీస్ కు 173 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఓవర్ నైట్ స్కోరు 151-5తో మూడో రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ స్కోరు 300 దగ్గర వరకూ వచ్చిందంటే అందుకు రహానే, శార్దూల్ ఠాకూరే కారణం. ఈ జోడీ ఏడో వికెట్ కు 100కి పైగా పరుగులు జోడించి భారత్ కు గౌరవప్రదమైన స్కోరు అందించింది. రహానే 89 పరుగులు చేయగా, శార్దూల్ ఠాకూర్ 51 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ ఆసీస్ బౌలర్లు వేసిన బంతులను శరీరానికి తాకించుకుని మరీ క్రీజులో నిలబడ్డాడు. ఆసీస్ ఫీల్డర్లు క్యాచ్ లు మిస్ చేయడం కూడా భారత్ కు కలిసి వచ్చింది. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ 3, స్టార్క్ 2, బోలాండ్ 2, కామెరాన్ గ్రీన్ 2, లైయన్ 1 వికెట్ తీశారు.