జమ్మూ కాశ్మీర్ సంచలనం 'ఆకిబ్ నబీ'కి టీమిండియా పిలుపు వచ్చేనా.?

రంజీ ట్రోఫీ చరిత్రలో జమ్మూ కాశ్మీర్ జట్టు తొలిసారిగా ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది.

By -  Medi Samrat
Published on : 1 March 2026 9:20 PM IST

జమ్మూ కాశ్మీర్ సంచలనం ఆకిబ్ నబీకి టీమిండియా పిలుపు వచ్చేనా.?

రంజీ ట్రోఫీ చరిత్రలో జమ్మూ కాశ్మీర్ జట్టు తొలిసారిగా ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత విజయంలో ఆ జట్టు స్టార్ పేసర్ 'ఆకిబ్ నబీ దార్' ది కీలకపాత్ర. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన ఆకిబ్ ఏకంగా 60 వికెట్లు పడగొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇందులో ఏకంగా ఏడు ఐదు-వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. అంతేకాకుండా బ్యాట్‌తోనూ 245 పరుగులు సాధించాడు. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో అదరగొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలిచిన ఆకిబ్.. కేఎల్ రాహుల్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్న కర్ణాటకతో జరిగిన ఫైనల్లోనూ 5 వికెట్లు తీశాడు.

దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఈ కాశ్మీర్ కుర్రాడికి త్వరలోనే టీమిండియా నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ ఒక కీలక ప్రకటన చేశారు. సెలెక్టర్లు ఆకిబ్ నబీ ప్రదర్శనను చాలా దగ్గరగా గమనిస్తున్నారని, అతనికి ఖచ్చితంగా భారత జట్టులో ఆడే అవకాశం వస్తుందని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఆకిబ్ నబీ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడగా.. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు ఏకంగా రూ. 8.40 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది.

Next Story