ఆసియా క్రీడల్లో భారత్ హవా..హైదరాబాద్ యువ షూటర్ సంచలనం

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. మరో రెండు స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు.

By Srikanth Gundamalla
Published on : 29 Sept 2023 10:29 AM IST

Asian Games, India Hawa, Hyderabad,  young shooter,

 ఆసియా క్రీడల్లో భారత్ హవా..హైదరాబాద్ యువ షూటర్ సంచలనం

చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు కొనసాగుతున్నాయి. ఈ ఆసియా క్రీడల్లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. మరో రెండు స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్‌లో ముగ్గురు ఉన్న బృందం స్వర్ణం గెలుచుకుంది. ఈ టీమ్‌లో ఐశ్వరి ప్రతాప్‌ సింగ్, స్వప్నిల్ కుశాలె, అఖిల్‌ షిరన్‌ ఉన్నారు. 1,769 పాయింట్లతో ప్రపంచ రికార్డును నమోదు చేశారు. ఇక ఇదే విభాగంలో వ్యక్తిగత ప్రదర్శనలోనూ భారత షూటర్లు రాణించారు. ఫైనల్‌కు అర్హత సాధించారు. ఇందులో కూడా పతకాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ టీమ్‌ విభాగంలో ఇషా సింగ్, పాలక్, దివ్య తడిగోల్‌ బృందం రజతం గెలుచుకుంది. వ్యక్తిగత మహిళల విభాగంలో కూడా పాలక్‌ స్వర్ణం గెలవగా.. ఇషా సింగ్ రజతక పతకం దక్కించుకుంది. దీంతో.. భారత్‌ ఖాతాలో కేవలం షూటింగ్‌లోనే 17 పతకాలు వచ్చాయి. ఇందులో ఆరు గోల్డ్‌, 6 రజతాలు, 5 కాంస్య పతకాలు ఉన్నాయి.

టెన్నిస్ డబుల్స్‌లో రజక పతకం సాధించింది భారత్. డబుల్స్‌ విభాగంలో సాకేత్‌ మైనేని, రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోడీగా సిల్వర్‌ గెలుచుకున్నారు. రామ్‌కుమార్‌కు ఆసియా క్రీడల్లో ఇదే తొలిమెడల్. ఇక సాకేత్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం. కాగా.. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో భారత్‌ హవా కొనసాగుతూనే ఉంది. మొత్తం పతకాల సంఖ్య 30కి చేరుకోగా.. పతకాల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.

ఈ ఆసియా క్రీడల్లో హైదరాబాద్‌కు చెందిన యువ షూటర్‌ ఇషా సింగ్ అద్భుత ప్రదర్శనను చేసింది. బుధవారం ఒక స్వర్ణం, రజతం గెలిచిన ఆమె.. తాజాగా మరో రెండు రజతాలను సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల షూటింగ్ చరిత్రలో నాలుగు పతకాలు గెలిచిన భారత తొలి మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించింది ఇషా సింగ్. శుక్రవారం మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో హైదరాబాద్‌ కు చెందిన ఇషా సింగ్‌తో పాటు పాల్‌, దివ్యతో కూడిన బృందం రజతం సాధించింది. ఫైనల్‌లో ఈ త్రయం 1731 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. చైనా 1736 స్కోరుతో స్వర్ణం గెలుచుకుంది. కాగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రెండో స్థానంతో రజతం గెలవగా, పాలక్ స్వర్ణం ఖాతాలో వేసుకుంది.

Next Story