ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డు.. ఖాతాలో 100 పతకాలు
చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది.
By Srikanth Gundamalla
ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డు.. ఖాతాలో 100 పతకాలు
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట కొనసాగుతోంది. ఈ సారి భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. పతకాల మీద పతకాలను గెలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసియా క్రీడలు-2023లో భారత్ చరిత్రను తిరగరాసింది. ఇప్పటి వరకు 100 పతకాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో భారత్ వంద పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ఆసియా క్రీడల్లో భారత్ కొనసాగిస్తున్న జోరు దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపుతోంది. సత్తా చాటుతున్న ఆటగాళ్లను అందరూ ప్రశంసిస్తున్నారు.
చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పతకాల పట్టికలో తొలిసారిగా వంద మార్కును అందుకున్నది. శనివారం ఉదయం మహిళల కబడ్డీ పైనల్‌లో భారత్ 26-25 తేడాతో చైనీస్ తైపీని టీమిండియా మట్టి కరిపించింది. దాంతో.. భారత్ మరో స్వర్ణం చేజిక్కించుకుంది. అయితే.. అంతకుముందే ఆర్చరీలో భారత్‌కు నాలుగు పతకాలు లభించాయి. ఆర్చరీ మహిళల కాంపౌండ్ సింగిల్స్‌లో జ్యోతి సురేఖ స్వర్ణం గెలుచుకుంది. అదితి గోపీచంద్ కాంస్యం సొంతం చేసుకుంది. ఇక ఆర్చరీ పురుషుల కాంపౌండ్ సింగిల్స్‌లో ఓజాస్ ప్రవీణ్ డియోటలేకు స్వర్ణం లభించగా.. అభిషేక్ వర్మ సిల్విర్ గెలుచుకున్నారు. కాగా.. ఆసియా క్రీడల్లో ఓజాస్‌కు ఇది మూడో స్వర్ణ పతకం కావడం విశేషం.
ఆసియా క్రీడలు-2023 పతకాల పట్టిలో భారత్ 100 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. భారత్ 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్య పతకాలు సాధించింది. కాగా.. తొలిస్థానంలో 354 మెడల్స్‌తో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇందులో 187 స్వర్ణాలు, 104 రజతం, 63 కాంస్యాలు ఉన్నాయి. రెండో స్థానంలో జపాన్ 169 మెడల్స్‌తో (47 గోల్డ్, 57 సిల్వర్, 65 బ్రోన్జ్) నిలిచింది. మూడో స్థానంలో కొరియా 171 పతకాలతో (36 స్వర్ణం, 50 రజతం, 85 కాంస్యం) నిలిచింది.