Asian Games: బంగ్లాను చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన భారత్

ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల జోరు కొనసాగుతోంది. తాజాగా మెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ ఫైనల్‌కు చేరుకుంది.

By Srikanth Gundamalla  Published on  6 Oct 2023 5:23 AM GMT
Asian Games-2023, India,  bangladesh, final,

 Asian Games: బంగ్లాను చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన భారత్

ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల జోరు కొనసాగుతోంది. తాజాగా మెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ ఫైనల్‌కు చేరుకుంది. దాంతో మరో పతకం భారత్‌కు ఖాయం అయినట్లు అయ్యింది. అయితే.. సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 96 పరుగుల స్వల్ప స్కోరుకే 9 వికెట్లను కోల్పోయింది. అనంతరం రంగంలోకి దిగిన భారత్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 9.2 ఓవర్లలో 97 పరుగులు చేసి ఘనవిజయాన్ని అందుకుంది. తద్వారా ఫైనల్‌కు చేరింది.

ఈ మ్యాచ్‌లో తెలుగు తేజం తిలక్‌ వర్మ రాణించాడు. 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (40 నాటౌట్)కూడా రాణించాడు. నేపాల్‌పై ఇంతకుముందు సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్‌ ఈసారి డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అయితే.. తిలక్‌-రుతురాజ్‌ మాత్రం ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దూకుడుగా ఆడి 9.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేశారు. కాగా.. శనివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దానికి ముందు పాకిస్థాన్-ఆఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన వారితో భారత్‌ ఆసియా గేమ్స్‌-2023లో ఫైనల్‌లో తలపడనుంది.

సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. అందుకే ఆధిపత్యం చూపించడానికి మార్గం సులువు అయ్యింది. ముందుగా టాస్‌ నెగ్గిన భారత్‌ బౌలింగ్‌ చేయడానికి గ్రౌండ్‌లోకి దిగింది. అర్షదీప్‌ ఒక్కడు మాత్రమే ప్రధాన పేసర్‌గా తీసుకున్నారు. అయితే.. స్పిన్నర్లు సాయి కిశోర్‌ (3/12), వాషింగ్టన్ సుందర్ (2/15) బంగ్లా బ్యాటర్లను అడ్డుకున్నారు. వీరిద్దరితో పాటు షహబాజ్, రవి బిష్ణోయ్‌, తిలక్‌ వర్మ, అర్షదీప్‌ తలో వికెట్‌ తీశారు. దాంతో.. బంగ్లాదేశ్‌ ఏ విధంగానూ కోలుకునే అవకాశం ఇవ్వకుండా తక్కువ స్కోరుకే వెనుదిరిగేలా చేశారు బౌలర్లు. బంగ్లా బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఏమాత్రం చాన్స్‌ ఇవ్వకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించి విజయాన్ని ముద్దాడారు.

Next Story