Asia Cup-23: రిజర్వ్ డే రోజు కూడా వదలని వరుణుడు
సూపర్4 దశలో అయినా వరుణుడు సహకరిస్తాడని అభిమానులు కోరుకున్నా అది జరగడం లేదు.
By Srikanth Gundamalla
Asia Cup-23: రిజర్వ్ డే రోజు కూడా వదలని వరుణుడు
ఆసియాకప్-2023 సూపర్4 దశలో పాకిస్తాన్, భారత్ మ్యాచ్ ఆదివారం అర్ధాంతరంగా ముగిసింది. అయితే.. సోమవారం రిజర్వ్‌డేను ముందుగానే ప్రకటించారు. కానీ.. రిజర్వ్ డే రోజున కూడా వరుణుడు వదలడం లేదు. వర్షం కురుస్తూనే ఉంది. దాంతో.. స్టేడియం గ్రౌండ్‌లో కవర్లను కప్పి ఉంచారు. సమయానికి ఆట మొదలవుతుంది.. చూసేద్దాం అనుకున్న క్రికెట్ అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. అయితే.. పిచ్ తడిగా ఉండటంతో ఆట మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ మధ్యామ్నం 3 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండగా.. వాన కారణంగా ఆలస్యం అవుతోంది. కాగా.. ప్రస్తుతం వర్షం కాస్త తగ్గడంతో సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇవాళ వర్షం 90 శాతం వరకు ఉంటుందని వాతావరణశాఖ ముందే హెచ్చరించింది.
ఈ టోర్నీలో తొలుత ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షార్పణం అయ్యింది. బ్యాటింగ్ పూర్తయ్యాక.. బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. దాంతో.. చెరో పాయింట్ ఇచ్చారు. దాంతో.. మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక సూపర్4 దశలో అయినా వరుణుడు సహకరిస్తాడని అభిమానులు కోరుకున్నా అది జరగడం లేదు. రిజర్వ్ డే రోజున కూడా వర్షం కురిసి కవర్లు కప్పేయడం.. ఇంకా ఆలస్యం అవుతుండటంతో అభిమానుల్లో ఆనందం ఆవిరైపోతుంది.
ఇక ఈ మ్యాచ్‌లో ఆదివారం టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఓపెన్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ తమ వంతు భాగస్వామ్యం అందించారు. రోహిత్ (56), గిల్ (58) అర్థశతకాలతో శుభారంభం అందించారు. మంచి టోటల్ స్కోర్ లభిస్తుందని అనుకున్న సమయానికి వర్షం పడి మ్యాచ్ ఇవాళ్టికి వాయిదా పడింది. అయితే.. 24.1 ఓవర్ల వద్ద ఆటను నిలిపివేసే సమయానికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. విరాట్ (8), కేఎల్ రాహుల్ (17) పరుగులతో క్రీజులో ఉన్నారు.