Asia Cup-2023: భారత్ Vs పాక్, టాప్ ఆర్డర్ రాణిస్తుందా?
ఆసియాకప్-2023 టోర్నీలో ఇవాళ మరోసారి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది.
By Srikanth Gundamalla Published on 10 Sept 2023 7:07 AM ISTAsia Cup-2023: భారత్ Vs పాక్, టాప్ ఆర్డర్ రాణిస్తుందా?
ఆసియాకప్-2023 టోర్నీలో ఇవాళ మరోసారి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. రెండోసారి భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. సూపర్-4లో భాగంగా ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ పోరులో దాయాది దేశాలు తలపడనున్నాయి. లీగ్ దశలో ఈ నెల 2న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే.. అప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ అర్ధాంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. దాంతో.. చెరో పాయింట్ లభించింది. చాలా కాలంగా ఈ పాకిస్థాన్‌తో మ్యాచ్ కోసం ఎదురు చూసిన అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అభిమానుల ఆసక్తి, ప్రసారకర్తల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని నేటి మ్యాచ్‌కు ‘రిజర్వ్ డే’ను కేటాయించారు.
కాగా గత మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. కాస్త తడబడింది. 66 పరుగులకే టాప్-4 వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే.. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా చెలరేగడంతో చెప్పుకోదగ్గ స్కోరుని చేయగలిగింది. ఈసారి టాప్ ఆర్డర్ రాణించాల్సిన అవసరం ఉంది. ఇక నేపాల్‌తో జరిగిన టీమ్‌తో చూస్తే రెండు మార్పులు జరగడం ఖాయం అనిపిస్తోంది. వ్యక్తిగత కారణాలతో నేపాల్ మ్యాచ్‌కు స్టార్ బౌలర్ బుమ్రా దూరంగా ఉన్నారు. అయితే.. తాజాగా జరగనున్న పాకిస్తాన్ మ్యాచ్‌కు బుమ్రా బౌలింగ్ చేస్తాడు. షమీ స్థానంలో బుమ్రాకు అవకాశం ఉంటుంది. అయితే.. బ్యాటింగ్ విభాగంలో ఇప్పుడు కేఎల్ రాహుల్ పైనే అందరి దృష్టి పడింది.
ఈ ఏడాది మార్చి తర్వాత రాహుల్ వన్డే మ్యాచ్ ఆడలేదు. గాయం నుంచి కోలుకున్నాక ఇప్పుడు అతడి బ్యాటింగ్‌తో పాటు ఫిట్‌నెస్ కీలకం కానుంది. తుది జట్టులో ఇషాన్ కిషన్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే.. ఇషాన్ నాలుగు వన్డేల్లో నాలుగు అర్ధ సెంచరీలు చేసినా.. మిడిలార్డర్‌లో రాహుల్ కోసం కిషన్‌ను పక్కన పెట్టక తప్పదు. వరల్డ్ కప్ కొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో కోచ్ రాహుల్ ద్రవిడ్.. కేఎల్ రాహుల్‌ను పరిక్షించాల్సి ఉంటుంది. మరోవైపు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కోహ్లీ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పెద్ద స్కోర్ చేయలేదు. ఈసారి అయినా వాళ్లు మంచి స్టార్టప్ ఇవ్వాల్సి ఉంటుంది. శ్రేయాస్ కూడా నిరాశపర్చిన విషయం తెలిసిందే. బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్, జడేజా, కుల్దీప్‌లతో టీమిండియా పటిష్టంగా ఉంది.
పాక్ బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. పేస్ బౌలర్లు షాహిన్, రవూఫ్, నసీమ్ ఈ ముగ్గురు మొదటి మ్యాచ్‌లో టీమిండియాను ఇబ్బంది పెట్టారు. ఈసారి వికెట పడకుండా వారిని ఎదుర్కొంటే మంచి స్కోర్ లభించే అవకాశం ఉంటుంది. ఇక బ్యాటింగ్‌లో అయితే చివరి మ్యాచ్‌లో పాక్ కి ఈ అవకాశమే దొరకలేదు. కానీ.. ఇతర మ్యాచ్‌లను బేరీజు వేసుకుంటే ఓపెనర్లు ఇమామ్, ఫఖర్‌లతో పాటు మూడోస్థానంలో కెప్టెన్ బాబర్ బ్యాటింగ్ జట్టు గెలుపు ఓటములను నిర్దేశించవచ్చు. మిడిలార్డర్‌లో రిజ్వాన్, సల్మాన్, ఇఫ్తికార్ మెరుగైన ప్రదర్శన ఇవ్వగలరు. కాబట్టి రెండోసారి తలబడుతున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అందరి దృష్టిని మరోసారి ఆకర్షిస్తోంది.
అయితే.. మరోవైపు వర్షం అంతరాయం అందరినీ కలవరపెడుతోంది. ఆదివారం నగరంలో 90 శాతం వర్షసూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇక సోమవారం కూడా అదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాన అంతరాయం లేకుండా మ్యాచ్‌లో ఫలితం వస్తుందా అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇక పిచ్ బౌలర్లకే అనుకూలంగా కనిపిస్తోంది.