ఆసియా కప్-2022 షెడ్యూల్ విడుదల‌.. దాయాదుల పోరు ఎప్పుడంటే..

Asia Cup 2022 schedule announced. నిరీక్షణకు తెర‌ప‌డింది. ఆసియా క‌ప్ షెడ్యూల్ రిలీజైంది.

By Medi Samrat  Published on  2 Aug 2022 6:41 PM IST
ఆసియా కప్-2022 షెడ్యూల్ విడుదల‌.. దాయాదుల పోరు ఎప్పుడంటే..

నిరీక్షణకు తెర‌ప‌డింది. ఆసియా క‌ప్ షెడ్యూల్ రిలీజైంది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల ఘోర పరాజయానికి.. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ కు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వ‌చ్చింది. ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఆగస్టు 28న జరగనుంది. ఆగస్టు 27న దుబాయ్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య‌ జ‌రుగ‌నున్న మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మేర‌కు బిసిసిఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియాలో షెడ్యూల్‌ను ప్రకటించారు. టోర్నమెంట్‌లో ప్రారంభ మ్యాచ్ శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతుంది. దీని తర్వాత ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌ జరుగుతుంది.

అనంత‌రం భారత్ తన తదుపరి మ్యాచ్‌ని ఆగస్టు 31న క్వాలిఫయర్ జట్టుతో ఆడనుంది. సూపర్ 4 సెప్టెంబర్ 3న ప్రారంభమవుతుంది. గ్రూప్ దశలో సంచ‌ల‌నాలు న‌మోదు కాక‌పోతే.. సెప్టెంబరు 4న భారత్ మళ్లీ పాకిస్థాన్‌తో తలపడుతుంది. భారత్‌, పాకిస్థాన్‌లు గ్రూప్‌-ఎ నుంచి సూపర్‌ 4కి వెళ్లాలని అభిమానులు భావిస్తున్నారు. టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది.. అయితే ఆ దేశంలో కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక సమస్యల కారణంగా ఇది యూఏఈకి మార్చబడింది. 2018లో యూఏఈలో జ‌రిగిన ఆసియా క‌ప్‌ ఫైనల్స్‌లో భారత్, బంగ్లాదేశ్‌ను ఓడించింది. యూఏఈ వరుసగా 2వ సారి టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.




Next Story