ఆరేసిన అశ్విన్.. ప్ర‌త్య‌ర్థి 69కే ఆలౌట్‌

Ashwin picks 6 wickets against Somerset.టీమ్ఇండియా సీనియ‌ర్ స్పిన్న‌ర్ అశ్విన్.. ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2021 3:10 AM GMT
ఆరేసిన అశ్విన్.. ప్ర‌త్య‌ర్థి 69కే ఆలౌట్‌

టీమ్ఇండియా సీనియ‌ర్ స్పిన్న‌ర్ అశ్విన్.. ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్‌( డబ్ల్యూటీసీ) ఫైన‌ల్‌లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. ఇంగ్లాండ్‌తో భార‌త జ‌ట్టు ఐదు టెస్టుల సిరీస్ ఆడ‌నుంది. ఇందుకు మూడు వారాల స‌మ‌యం ఉండ‌డంతో భార‌త ఆట‌గాళ్లు అంతా త‌మ ఫ్యామిలీతో క‌లిసి స‌ర‌దాగా గడుపుతున్నారు. అయితే.. అశ్విన్‌కు మాత్రం అనుకోకుండా అనుకోకుండా ఇంగ్లాండ్.. కౌంటీ జట్టు సర్రే నుంచి ఆహ్వానం అందింది. దీంతో మ్యాచ్ ప్రాక్టీస్ దొరుకుతుండ‌డంతో అశ్విన్ ఆజ‌ట్టు త‌రుపున ఆడుతున్నాడు.

సర్రే తరఫున ఆడుతున్న అశ్విన్.. సోమ‌ర్‌సెట్పై ఆరు వికెట్ల‌తో చెల‌రేగిపోయాడు. అశ్విన్‌తో పాటు మ‌రో స్పిన్న‌ర్ డేనియ‌ల్ మెరియారీ తోడ‌వ్వ‌డంతో సోమ‌ర్‌సెట్ 69 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసిన యాష్.. 6 వికెట్లు తీసి ప్రత్యర్ధి నడ్డి విరిచాడు. మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సోమర్‌సెట్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. హిల్డ్రెత్(107) శతకం చేయ‌గా.. మిగ‌తా ఆట‌గాళ్లు త‌లా ఓ చేయి వేయ‌డంతో.. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జ‌ట్టు 429 పరుగులు చేసింది. సర్రే బౌలర్లల్లో జోర్డాన్‌ క్లార్క్‌, అమర్‌ విర్ధి చెరో 3 వికెట్లు పడగొట్టగా, డేనియల్‌ మోరియార్టీ 2, అశ్విన్‌, ఆర్‌ క్లార్క్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సర్రే జట్టులో ఓపెనర్లు రోరీ బర్న్స్‌(50), స్టోన్‌మెన్‌(67) మాత్రమే రాణించారు. మిగ‌తా వారు విఫ‌లం కావ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆజ‌ట్టు కేవలం 240 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన సోమర్‌సెట్‌కు స్పిన్నర్లు అశ్విన్‌(6), మోరియార్టీ(4) చుక్కలు చూపించారు. వీరి ధాటికి సోమర్‌సెట్‌ రెండో ఇన్నింగ్స్‌లో 69 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్రే జట్టు కడపటి వార్తలందేసరికి 4 వికెట్ల నష్టానికి106 పరుగులు చేసింది. క్రీజ్‌లో జేమీ స్మిత్‌(46), ర‌విచంద్ర‌న్ అశ్విన్‌(0) ఉన్నారు. సర్రే గెలుపునకు మరో 153 పరుగుల అవసరం.

Next Story
Share it