గిఫ్ట్ ఇవ్వ‌డంతో పాటు అజాజ్‌కు సాయం చేసిన అశ్విన్

Ashwin gifts Ajaz Patel his Test jersey autographed by teammates.అజాజ్ ప‌టేల్.. ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో ఈ పేరు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Dec 2021 1:39 PM IST
గిఫ్ట్ ఇవ్వ‌డంతో పాటు అజాజ్‌కు సాయం చేసిన అశ్విన్

అజాజ్ ప‌టేల్.. ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో ఈ పేరు మార్మోగుతుంది. ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన రెండో టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసి చ‌రిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఓ బౌల‌ర్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు ప‌డ‌గొట్ట‌డం ఇది మూడోసారి. ఇంతక‌ ముందు ఇంగ్లాండ్ బౌల‌ర్ జిమ్ లేక‌ర్‌, భార‌త బౌల‌ర్ అనిల్ కుంబ్లే మాత్ర‌మే ఈ ఘ‌న‌త సాధించారు. అజాజ్ ప‌టేల్ ఈ ఘ‌న‌త సాధించిన మూడో బౌల‌ర్‌గా నిలిచాడు. ప్ర‌స్తుతం అత‌డిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బౌల‌ర్ అయిన‌ప్ప‌టికి భార‌త సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అత‌డికి ప్ర‌త్యేక కానుక అందించాడు.

మ్యాచ్ ముగిసిన అనంత‌రం భార‌త జ‌ట్టు ఆట‌గాళ్ల సంత‌కాల‌తో కూడిన త‌న జెర్సీని అత‌డికి ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా అశ్విన్ మాట్లాడుతూ.. అజాజ్ బౌలింగ్‌ను డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎంతో అస్వాదించాన‌ని చెప్పాడు. త‌న స‌హ‌చ‌రుల సంతకాలు చేసిన జెర్సీని తానే అందుకుంటానేమో అనుకున్నా అని అశ్విన్ చెప్పారు. జెర్సీ అందుకున్న ఆనందాన్ని మాటల్లో చెప్ప‌లేను అని.. అస‌లు ప్ర‌స్తుతం త‌న‌కు మాట‌లు రావ‌డం లేద‌ని అజాజ్ సంతోషం వ్య‌క్తం చేశాడు.

జెర్సీ అందించిన అశ్విన్‌.. అజాజ్‌కు మ‌రో విష‌యంలోనూ సాయ‌ప‌డ్డాడు. అజాజ్‌కు ట్విట‌ర్ అకౌంట్ ఉన్న‌ప్ప‌టికీ దానికి బ్లూ టిక్ మార్క్ లేదు. విష‌యాన్ని గ‌మ‌నించిన అశ్విన్‌.. అజాజ్ త‌రుపున ట్విట‌ర్‌కు రిక్వెస్ట్ పెట్టాడు. 'డియర్‌ ట్విటర్‌.. టెస్టు చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అజాజ్ ప‌టేల్ నిలిచాడు. అతని అకౌంట్‌ను వెరిఫై చేసి బ్లూ టిక్‌ మార్క్‌ ఇవ్వండి' అంటూ ట్వీట్ చేశాడు. అశ్విన్ చేసిన విజ్ఞ‌ప్తిని పరిశీలించిన ట్విట‌ర్ అధికారులు వెరిఫై చేసి ఎజాజ్‌కు బ్లూ టిక్ మార్క్ ఇచ్చారు. దీని ప‌ట్ల అశ్విన్.. ట్విట‌ర్‌కు థ్యాంక్స్ చెబుతూ రీ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story