ఆస్ట్రేలియన్ ఓపెన్‌.. మ‌హిళ‌ల సింగిల్స్ విజేతగా ఆష్లే బార్టీ

Ashleigh Barty Wins Australian Open Women's Singles Title.టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2022 10:41 AM GMT
ఆస్ట్రేలియన్ ఓపెన్‌.. మ‌హిళ‌ల సింగిల్స్ విజేతగా ఆష్లే బార్టీ

సొంత గ‌డ్డ‌పై ఆస్ట్రేలియా టెన్నిస్ కెర‌టం ఆష్లే బార్టీ అద‌ర‌గొట్టింది. టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఈ ఏడాది మహిళల సింగిల్స్‌ విభాగంలో కొత్త చాంపియన్ గా అవతరించింది. మెల్‌బోర్న్‌లో జ‌రిగిన పైన‌ల్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ యాష్లే బార్టీ 6-3, 7-6 (7-2)తో వరుస సెట్లలో అమెరికా క్రీడాకారిణి డానియెల్లె కొలిన్స్ ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన బార్టీ వ‌రుస సెట్ల‌ను గెలిచి విజేత‌గా నిలిచింది.

అంచనాలకు తగ్గట్టుగానే 6-3తో తొలి సెట్ ను అలవోకగా చేజిక్కించుకుంది బార్టీ. అయితే రెండో సెట్ లో ప్రత్యర్థి కొలిన్స్ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఓ ద‌శ‌లో 1-5 తేడాతో వెనుక‌బ‌డ్డ బార్టీ ఆ త‌రువాత అనూహ్యంగా పుంజుకుంది. సొంత ప్రేక్ష‌కుల మ‌ధ్య త‌న‌దైన షాట్ల‌తో విరుచుకుప‌డింది. పలుమార్లు కొలిన్స్ సర్వీసును బ్రేక్ చేసి ఆ సెట్ ను టైబ్రేకర్ దిశగా మళ్లించింది. టైబ్రేకర్ లో ఆసీస్ క్రీడాకారిణికి ఎదురులేకుండాపోయింది. కొలిన్స్ పై 7-2తో టైబ్రేకర్ లో నెగ్గి మహిళల సింగిల్స్ విజేతగా అవతరించింది. 44 ఏళ్ల త‌రువాత మ‌హిళ సింగిల్స్‌లో మ‌ళ్లీ ఆస్ట్రేలియా ప్లేయ‌ర్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ ద‌క్కింది. 1978లో చివ‌రి సారి ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ క్రిస్టినా ఓనీల్ టైటిల్ గెలిచింది.


25 ఏళ్ల ఆష్లే బార్టీకి ఇదే తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. గతంలో ఆమె ఫ్రెంచ్ ఓపెన్ (2019), వింబుల్డన్ (2021) టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ఆమెకు రూ.15 కోట్ల మేర ప్రైజ్ మనీ దక్కింది.


Next Story
Share it