గంభీర్, సంజూలను టీజ్ చేసిన అర్ష్‌దీప్.. వీడియోలు వైరల్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై టీమిండియా 96 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి...
By - అంజి |
గంభీర్, సంజూలను టీజ్ చేసిన అర్ష్‌దీప్.. వీడియోలు వైరల్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై టీమిండియా 96 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి, టీ20 ప్రపంచకప్ ట్రోఫీని నిలబెట్టుకుంది. అయితే, మైదానంలో ఆటగాళ్ల సంబరాలు ఒకెత్తు అయితే, సోషల్ మీడియాలో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చేసిన 'రీల్స్' హంగామా మరో ఎత్తు. మ్యాచ్ ముగిసిన కొద్ది నిమిషాలకే అర్ష్‌దీప్ వరుసగా పోస్ట్ చేసిన వీడియోలు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. అర్ష్‌దీప్ చేసిన రీల్స్‌లో అన్నింటికంటే హైలైట్.. "జస్టిస్ ఫర్ సంజూ శాంసన్". గత కొన్నేళ్లుగా జట్టులో స్థానం కోసం పోరాడుతున్న సంజూ, ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో తన ముద్ర వేశాడు. ఫైనల్లో 46 బంతుల్లో 89 పరుగులు చేయడమే కాకుండా, టోర్నీ పొడవునా 321 పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నాడు. అర్ష్‌దీప్ తన వీడియోలో సంజూను చూపిస్తూ "పాజీ, జస్టిస్ దొరికింది!" అని అనడం అభిమానులను ఖుషీ చేస్తోంది.
గౌతీ భాయ్ నవ్వు.. ఇషాన్ కిషన్ జోష్:
ఎప్పుడూ సీరియస్‌గా ఉండే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం అర్ష్‌దీప్ రీల్ కోసం తన గంభీర్యాన్ని పక్కనపెట్టి చిరునవ్వు చిందించడం విశేషం. అలాగే ఇషాన్ కిషన్‌తో కలిసి "ఏక్ బిహారీ.. సబ్ పే భారీ" అంటూ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ టోర్నీలో ఇషాన్ 317 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. ఇక ఫైనల్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లతో కలిసి అర్ష్‌దీప్ చేసిన 'ఎక్స్‌ప్రెస్ రీల్' కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
రెండుసార్లు విజేతలుగా..:
వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ రెండు విజయాల్లోనూ అర్ష్‌దీప్ కీలక పాత్ర పోషించాడు. "మొదటిసారి గెలవడం చాలా బాగుంది, అందుకే రెండోసారి కూడా గెలిచాం" అంటూ అర్ష్‌దీప్ తన వ్యక్తిగత రీల్‌లో గర్వంగా చెప్పుకున్నాడు.