అర్జున్ టెండూల్కర్ ను తీసుకోవడంపై వస్తున్న కామెంట్స్ పై స్పందించిన జయవర్ధనే
Arjun Tendulkar Bought By Mumbai Indians "Purely On A Skill Basis", Says Mahela Jayawardene. అర్జున్ టెండూల్కర్ ను తీసుకోవడంపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే స్పందించాడు.
By Medi Samrat
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను ఐపీఎల్ వేలంలో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. అర్జున్ ప్రారంభ ధర రూ.20 లక్షలు కాగా, ఇతర ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో చివరికి అదే ధర వద్ద ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్న ముంబయి జట్టులో స్థానం సంపాదించలేకపోవడంతో అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ ఎంపికపైనా సందేహాలు వచ్చాయి. అయితే వేలంలో ముంబయి ఇండియన్స్ వర్గాలు అర్జున్ టెండూల్కర్ ను కొనుగోలు చేశాయి. సచిన్ తనయుడు అర్జున్ లెఫ్టార్మ్ పేస్ బౌలర్ మాత్రమే కాదు, బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇప్పటి వరకూ అర్జున్ టెండూల్కర్ నెట్ బౌలర్ గా తన సేవలను అందిస్తూ వస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా నెట్ బౌలర్ గా సేవలు అందిస్తూ వచ్చాడు అర్జున్ టెండూల్కర్.
అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంటారని ముందే ఊహించామని.. అదే జరిగిందని పలువురు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఈ కామెంట్లపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే స్పందించాడు. కేవలం ప్రతిభ ఆధారంగానే ముంబై జట్టులోకి అర్జున్ ప్రవేశించాడని.. క్రికెట్ గురించి మరింత నేర్చుకునేందుకు అర్జున్ కు ముంబై ఇండియన్స్ ఉపయోగపడుతుందని జయవర్ధనే చెప్పుకొచ్చాడు. అర్జున్ గొప్ప ఆటగాడిగా తయారవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. సచిన్ కుమారుడు అనే పెద్ద ట్యాగ్ అర్జున్ కు ఉందని... కానీ, అదృష్టం కొద్దీ అతను బౌలర్ అని, బ్యాట్స్ మెన్ కాదని జయవర్ధనే తెలిపాడు. అర్జున్ ఇప్పుడిప్పుడే ముంబైకి ఆడుతున్నాడని.. ఇప్పుడు ముంబై ఫ్రాంచైజీకి ఆడుతాడని..అర్జున్ పై ఎక్కువ ఒత్తిడి ఉంచరాదని, అతనికి సమయం ఇవ్వాలని అంటున్నాడు జయవర్ధనే.
అర్జున్ గురించి ముంబై ఇండియన్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ, అతనితో నెట్స్ లో తాను చాలా సమయాన్ని గడిపానని, కొన్ని ట్రిక్స్ నేర్పానని చెప్పాడు. అర్జున్ ది కష్టపడే మనస్తత్వమని అన్నాడు. నేర్చుకోవాలనే తపన అర్జున్ లో ఉందని అన్నాడు. సచిన్ కుమారుడు అనే ఒత్తిడి మాత్రం అర్జున్ పై ఎప్పుడూ ఉంటుందని చెప్పాడు.
ముంబై ఇండియన్స్ లో స్థానం సంపాదించడంపై అర్జున్ టెండూల్కర్ సోదరి సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో స్పందించింది. "ఇది నీ ఘనత. దీన్ని నీ నుంచి ఎవరూ తీసుకోలేరు. క్రికెట్ అనేది నీ రక్తంలోనే ఉంది. ఇన్నాళ్లు నెట్స్ లో సాధన చేసి ఉన్నత క్రికెటర్ అయ్యాడు. ఇక 22 గజాల పిచ్ పై తుపాను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు" అని చెప్పుకొచ్చింది. ఇక అరవీర భయంకరులు ఉన్న ముంబై ఇండియన్స్ తుదిజట్టులో అర్జున్ టెండూల్కర్ క స్థానం దక్కడం అన్నది డౌటే..!