చరిత్ర సృష్టించిన అర్జెంటీనా.. 28 ఏళ్ల త‌రువాత కోపా అమెరికా విజేత

Argentina beat Brazil to win Copa America.కోపా అమెరికా పుట్‌బాల్ టోర్నీని అర్జెంటీనా జ‌ట్టు కైవ‌సం చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 July 2021 9:52 AM IST
చరిత్ర సృష్టించిన అర్జెంటీనా.. 28 ఏళ్ల త‌రువాత కోపా అమెరికా విజేత

కోపా అమెరికా పుట్‌బాల్ టోర్నీని అర్జెంటీనా జ‌ట్టు కైవ‌సం చేసుకుంది. నువ్వా-నేనా అన్న‌ట్లుగా సాగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0 గోల్ తేడాతో బ్రెజిల్‌పై విజ‌యం సాధించింది. దీంతో 28ఏళ్ల త‌రువాత ఈ ప్ర‌తిష్టాత్మ‌క టోర్నిని అర్జెంటీనా గెలుచుకుంది. ఏంజెల్ డీ మారియా సాధించిన గోల్ అర్జెంటీనాను విజేతగా నిలబెట్టింది. దీంతో 15వ కోపా టైటిల్‌ను అర్జెంటీనా ముద్దాడింది. మెస్సీ సార‌థ్యంలో అర్జెంటీనా గెలిచిన అతిపెద్ద టోర్నీ ఇదే. 1993 త‌రువాత ఈ జ‌ట్టు కోపా అమెరికా టోర్నీని ఇదే గెల‌వ‌డం. ఈ విజ‌యం ద్వారా అత్య‌ధిక టైటిళ్లు సాధించిన ఉరుగ్వే స‌ర‌స‌న అర్జెంటీనా నిలిచింది.

దక్షిణ అమెరికా ఖండంలోని దేశాల మధ్య జరిగే కోపా అమెరికా టోర్నీ 2021 సీజన్‌లో మొత్తం పది దేశాలు పాల్గొన్నాయి. వీటిలో బ్రెజిల్‌, అర్జెంటీనాలు ఫైనల్‌కు చేరుకున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం వేకువ జామున రియో డీ జనెయిరోలోని మారాకానా స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆట ఇరవై రెండో నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు ఏంజెల్ డీ మారియా చేసిన గోల్‌ మ్యాచ్‌కు కీలకంగా మారింది. ఇక బ్రెజిల్‌కు గోల్‌ చేసే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయగలిగారు అర్జెంటీనా ఆటగాళ్లు.

దీంతో తన సారథ్యంలో దేశానికి ఓ అంతర్జాతీయ టైటిల్ తెచ్చిపెట్టాలనే మెస్సీ కల నెరవేరింది. ఆ దేశానికి చెందిన దిగ్గజ ఆటగాడు మారడోనా నేతృత్వంలో కూడా అర్జెంటీనా కోపా టైటిల్ గెలవలేదు. కోపా అమెరికా ఫైనల్లో బ్రెజిల్‌, అర్జెంటీనా తలపడడం ఇది మూడోసారి. 1937లో తొలిసారి ఈ టోర్నీ ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. అప్పుడు కూడా అర్జెంటీనా జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత రెండు సార్లు (2004, 2007) బ్రెజిల్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నది. ఇప్పటి వరకూ అర్జెంటీనా, బ్రెజిల్‌ 112 మ్యాచ్‌ల్లో తలపడగా.. బ్రెజిల్‌ 46 మ్యాచ్‌లు, అర్జెంటీనా 41 మ్యాచ్‌ల చొప్పున గెలుపొందాయి.

ఓవైపు ఓటమి భారంతో బ్రెజిల్‌ స్టార్‌ ప్లేయర్‌ నెయ్‌మర్‌ దా సిల్వ శాంటోస్‌ శోకంతో ఏడుస్తుంటే.. మరోవైపు తన నేతృత్వంలో అర్జెంటీనా తొలి కప్పు సాధించడంతో మెస్సీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఓదార్చుకున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.


Next Story