పంజాబ్ కింగ్స్ జట్టులోనూ ఓ పొలార్డ్

Anil kumble says Shahrukh Khan Reminds of Kieron Pollard.పంజాబ్ కింగ్స్ జట్టులోనూ ఓ పొలార్డ్ ఉన్నాడని ఆ జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు. షారూక్ ఖాన్ బ్యాటింగ్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2021 8:46 AM GMT
punjab kings

ఐపీఎల్ ఇంకొద్ది రోజుల్లో మొదలు కాబోతోంది. ఇతర దేశాల ఆటగాళ్ల విధ్వంసం ఎలా ఉన్నా.. ఇండియన్ ప్లేయర్స్ ఆట తీరును భారత క్రికెట్ అభిమానులు గమనిస్తూ ఉంటారు. ఐపీఎల్ లో మంచి ప్రదర్శన ఇచ్చి భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని పలువురు అనుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది ఐపీఎల్ లో సంచలనాలు సృష్టించి భారత జట్టులో అవకాశం దక్కించుకున్నారు. అందుకే చాలా మంది ఆటగాళ్లు ఎంతో సీరియస్ గా ఈ టోర్నమెంట్ ను తీసుకుంటూ ఉంటారు. ఇక ఓ ఆటగాడి గురించి ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. అతడే 'షారుఖ్ ఖాన్'. తమిళనాడుకు చెందిన ఈ క్రికెటర్ పలు టోర్నమెంట్లలో పించ్ హిట్టింగ్ తో పేరు సంపాదించుకున్నాడు.

ముఖ్యంగా దేశవాళీ టోర్నమెంట్లలో రాణించడంతో ఐపీఎల్ అవకాశం కూడా దక్కింది. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడుతున్నాడు ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలానికి రూ.20 లక్షల కనీస ధరతో వచ్చిన షారూక్‌ ఖాన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ పెద్ద ఎత్తున పోటీపడ్డాయి. పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.5.25 కోట్లకి అతడ్ని సొంతం చేసుకుంది. ప్రాక్టీస్ లో షారుఖ్ ఖాన్ అలవోకగా సిక్సర్లు బాదుతూ ఉన్నాడు. ఇక పంజాబ్ కింగ్స్ కోచ్ అనిల్ కుంబ్లే చేసిన వ్యాఖ్యలు అతడిపై అంచనాలను పెంచేస్తూ ఉన్నాయి.

పంజాబ్ కింగ్స్ జట్టులోనూ ఓ పొలార్డ్ ఉన్నాడని ఆ జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు. షారూక్ ఖాన్ బ్యాటింగ్‌లో కీరన్ పొలార్డ్‌ని తలపిస్తున్నాడని అన్నాడు. నేను ముంబయి ఇండియన్స్ జట్టులో ఆడే సమయంలో నెట్స్‌లో కీరన్ పొలార్డ్ చాలా ప్రమాదకరంగా కనిపించేవాడని.. నేను బౌలింగ్ చేసే ముందు స్ట్రయిట్‌గా మాత్రం బంతిని హిట్ చేయద్దని చెప్పేవాడ్ని అని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు నేను పంజాబ్ కింగ్స్ టీమ్ నెట్స్‌లో బౌలింగ్ చేయడం లేదు. కాస్త వయసు పెరిగింది కదా.. బౌలింగ్ చేసేందుకు శరీరం సహకరించడం లేదని తెలిపాడు. ఒకవేళ సహకరించినా.. నేను మాత్రం షారూక్‌కి బౌలింగ్ చేయబోనని అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. పొలార్డ్ తన హిట్టింగ్ తో ముంబై ఇండియన్స్ కు ఎన్నో విజయాలను అందించాడు.. అలాంటి పొలార్డ్ తో షారుఖ్ ఖాన్ ను పోలుస్తూ ఉన్నారు. ఇక టోర్నమెంట్ లో ఈ యువకుడి మెరుపుల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.


Next Story
Share it