ఆసియా కప్ లో పాకిస్తాన్ చేస్తున్న ఓవరాక్షన్ కు ఐసీసీ కూడా తీవ్రంగా సమాధానం ఇస్తోంది. భారత్ తో ఆదివారం సెప్టెంబర్ 21 నాడు జరగబోయే మ్యాచ్ కు మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహరించనున్నట్టు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో షేక్ హ్యాండ్ వివాదం తర్వాత మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తిగా ఉంది. టీమిండియా తమకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని, దీనికి కారణమైన పైక్రాఫ్ట్ ను నిషేధించాలని పాక్ బోర్డు కోరినప్పటికీ ఐసీసీ పాక్ నిర్ణయాన్ని కొట్టిపారేసింది.
సెప్టెంబర్ 14 రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ టైమ్‌లో ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ సారథి సల్మాన్ అలీ ఆగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. ఇండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇస్తారని పాక్ ఆటగాళ్లు కాసేపు గ్రౌండ్‌లోనే వేచి చూడగా వారికి భంగపాటు ఎదురైంది.