ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఓ ఛానల్‌లో ప్రసారమయ్యే టాప్ గేర్ షో ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ లండన్‌లోని డన్‌ఫోల్డ్ పార్క్, ఎయిర్ డ్రోమ్ వద్ద టెస్ట్ ట్రాక్ వద్ద మంచుతో నిండిన పరిస్థితుల్లో షూటింగ్ చేస్తుండగా ఘటన జరిగింది. వెంటనే అతడిని ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే.. 45 ఏళ్ల ఫ్లింటాఫ్ ప్రాణాలు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో ఫ్లింటాప్ సాధారణ వేగంతోనే ప్రయాణించాడని, అతి వేగంతో జరిగిన ప్రమాదం కాదని నిర్వాహకులు తెలిపారు.
ఆండ్రూ ఫ్లింటాప్ భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితుడే. ఇంగ్లాండ్ తరుపున అండ్రూ ఫ్లింటాప్ 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 7,315 పరుగులు చేయడంతో పాటు 400 పైగా వికెట్లు తీశాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.