సాకులు చెప్పడం మానుకోవాలి.. రిషబ్ పంత్‌పై మాజీ ఐపీఎల్ స్టార్ ఆగ్రహం
భారత మాజీ బ్యాట్స్‌మెన్, ప్రముఖ వ్యాఖ్యాత అంబటి రాయుడు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) కెప్టెన్ రిషబ్ పంత్ ప్రస్తుత ఫామ్‌పై ప్రశ్నలు లేవనెత్తాడు.
By Medi Samrat
భారత మాజీ బ్యాట్స్‌మెన్, ప్రముఖ వ్యాఖ్యాత అంబటి రాయుడు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) కెప్టెన్ రిషబ్ పంత్ ప్రస్తుత ఫామ్‌పై ప్రశ్నలు లేవనెత్తాడు. పంత్ తన నిర్ణయాలను నియంత్రించుకోవాలని, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సాకులు చెప్పడం మానుకోవాలని వ్యాఖ్యానించాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ పంత్ ఏడో నంబర్‌లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. దాని కారణంగా పంత్ ఇప్పుడు విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
ప్రస్తుత సీజన్‌లో పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో అతడు కేవలం ఒక అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌తో సహా 106 పరుగులు మాత్రమే చేశాడు. ఢిల్లీ మ్యాచ్‌లో పంత్ ఏడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి తన ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. పంత్ ముఖేష్ కుమార్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మ్యాచ్‌లో ఓటమితో లక్నో నెట్ రన్ రేట్ -0.054తో ఐదో స్థానానికి పడిపోయింది.
మ్యాచ్ తర్వాత అంబటి రాయుడు రిషబ్ పంత్‌పై తన కోపాన్ని బయటపెట్టాడు. పంత్ తీసుకునే నిర్ణయాల పట్ల నియంత్రణ ఉండాలని.. అతడు టాప్ ఆర్డర్‌లో ఎక్కువ బ్యాటింగ్‌కు రావాలని చెప్పాడు. రిషబ్ పంత్ నిజంగా LSG లో తీసుకుంటున్న నిర్ణయాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నాడు. పంత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలి. అలా చేస్తే పంత్ ఇకపై ఎటువంటి సాకు చెప్పలేడు. పంత్ కెప్టెన్.. ఇది కెప్టెన్ ఆట.. దానిని మనమందరం అంగీకరిస్తాము. టోర్నీలో ముందుకు వెళ్లడానికి LSG కొన్ని మార్పులు చేయాలి. బహుశా మయాంక్ యాదవ్‌ను చేర్చుకోవాలి. అలాగే పంత్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందన్నాడు.
లక్నో ఇన్నింగ్స్ ముగియడానికి రెండు బంతులు మిగిలి ఉండగా పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ మ్యాచ్‌లో పంత్ రెండు బంతులు ఆడినా.. ఖాతా కూడా తెరవలేకపోయాడు. లక్నో ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత, అతను డ్రెస్సింగ్ రూమ్‌లో నిరాశగా కనిపించాడు. లోయర్ ఆర్డర్‌లో పంత్ దిగడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. పంత్ ఏడో నంబర్‌లో బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం పంత్‌దేనా లేదా టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని ఆలస్యంగా బ్యాటింగ్ చేయమని కోరిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు మెంటార్ జహీర్ ఖాన్‌తో పంత్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. బ్యాటింగ్ పొజిషన్ గురించి జహీర్‌తో వాదిస్తున్నట్లు అనిపించింది. దీనిపై చర్చిస్తూ రాయుడు మాట్లాడుతూ.. పంత్ నిజంగా తనపై తాను బాధ్యత వహించాలని భావిస్తున్నాను. అతడు తన స్వంత నిర్ణయాలు తీసుకోవాలన్నాడు.