ఆ మ్యాచ్‌లో డకౌట్.. ఈ మ్యాచ్‌లో మాత్రం పర్వాలేదనిపించిన 'రాయుడు'
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 (CPL 2023) లో అంబటి రాయుడు ఆడుతున్న విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 26 Aug 2023 3:01 PM ISTకరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 (CPL 2023) లో అంబటి రాయుడు ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే రాయుడు టీం ఆడిన తొలి రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దుకాగా.. మూడో మ్యాచ్‌లో రాయుడు డకౌట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో జట్టు ఓటమిని చవిచూసింది. ఇక నాలుగో మ్యాచ్‌లో రాయుడు పర్వాలేదనిపించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ తరఫున ఆడుతున్న రాయుడు క్లిష్ట సమయంలో 32 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే రాయుడు ఇన్నింగ్స్ వల్ల జట్టుకు ఏమాత్రం ఉపయోగం లేకపోయింది. రాయుడు జట్టు 65 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సంవత్సరం ఐపీఎల్ నుండి రిటైర్ అయిన రాయుడు.. ప్రవీణ్ తాంబే తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడిన రెండవ భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. రాయుడు అంతకుముందు మ్యాచ్‌లో సున్నాకే ఔటయ్యాడు.
రాయుడు ఈ మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో 32 పరుగులు చేశాడు. అనంతరం మాంటీ రాయుడిని క్లీన్ బౌల్డ్ చేయడంతో పెవిలియన్‌కు వెనుదిరిగాడు. అయితే రాయుడు.. ఇర్విన్ లూయిస్ (48)తో కలిసి మూడో వికెట్‌కు 24 బంతుల్లో 50 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
మొదట బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 197 పరుగులు చేసింది. షాయ్ హోప్ 54 పరుగులతో రాణించాడు. సయీమ్ అయ్యూబ్ 31 పరుగులు, షిమ్రాన్ హెట్మెయర్ 26 పరుగులు చేశారు.
ఛేదనకు దిగిన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ 16.5 ఓవర్లలో 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇర్విన్ లూయిస్(48), రాయుడు(32) మాత్రమే పర్వాలేదనిపించారు. మరే ఇతర బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును కూడా దాటలేకపోయారు.