ఎన్ఓసీ ఇచ్చేందుకు బోర్డ్‌ నిరాక‌ర‌ణ‌.. ఆ ముగ్గురు బౌల‌ర్లు రెండేళ్లు ఏ లీగ్ ఆడే అవ‌కాశం లేన‌ట్లేనా..?

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జ‌ట్టులోని ప‌లువురు ఆటగాళ్లపై నిషేదం వేటు ప‌డే అవ‌కాశం ఉంది.

By Medi Samrat  Published on  26 Dec 2023 2:42 PM GMT
ఎన్ఓసీ ఇచ్చేందుకు బోర్డ్‌ నిరాక‌ర‌ణ‌.. ఆ ముగ్గురు బౌల‌ర్లు రెండేళ్లు ఏ లీగ్ ఆడే అవ‌కాశం లేన‌ట్లేనా..?

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జ‌ట్టులోని ప‌లువురు ఆటగాళ్లపై నిషేదం వేటు ప‌డే అవ‌కాశం ఉంది. ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, ఫజల్‌హక్ ఫరూఖీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ (ACB) సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి మినహాయింపును కోరారు. అయితే దీనికి బోర్డు రాబోయే రెండేళ్లపాటు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇవ్వకూడదని నిర్ణయించింది. దీంతో ఈ క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌లో ఆడడం అనుమానంగా మారింది.

ఏసీబీ విడుదల చేసిన ప్ర‌క‌ట‌న‌ ప్రకారం.. ఈ ఆటగాళ్లందరి వార్షిక ఒప్పందాలను 2024కి వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది. వీరు జనవరి 1 నుంచి తమ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి విముక్తి పొందాలని తమ కోరికను వ్యక్తం చేయడంతో.. బోర్డు ఈ విషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ACB తన వెబ్‌సైట్‌లో.. 'ఈ ఆటగాళ్లు క‌మ‌ర్శియ‌ల్‌ లీగ్‌లలో పాల్గొనడం వల్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌పై సంతకం చేయకూడదనుకున్నారు. జాతీయ జ‌ట్టుకు ఆడ‌టం త‌మ‌ విధిగా పరిగణించకుండా.. ఆఫ్ఘనిస్తాన్‌కు ఆడటం కంటే వారి వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది' అని తెలిపింది.

భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గానిస్థాన్ సిద్ధమవుతోంది. ఇందులో మొదటి మ్యాచ్ జనవరి 11న.. జనవరి 14న మొహాలీలో రెండో మ్యాచ్ జరగనుంది.. ఇండోర్‌లో జనవరి 17న మూడో మ్యాచ్ బెంగళూరులో జరగనుంది.

దీనిపై ఏసీబీ స్పందిస్తూ.. ఈ అంశంపై క్షుణ్ణంగా విచారణ జరిపి, ఏసీబీ ప్రయోజనాలకు అనుగుణంగా తగిన సిఫార్సులు చేసి.. ఏసీబీ ఉన్నతాధికారులతో పంచుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

Next Story