నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో బ్యాడ్మింటన్ క్రీడలో భారీ స్కామ్.. రంగంలోకి పోలీసులు
బ్యాడ్మింటన్ క్రీడాకారులు కొత్తరకం మోసానికి తెరలేపారు. వయస్సు తగ్గించి పిన్న వయస్కులతో పోటీ పడుతున్నారు.
By అంజి Published on 2 Aug 2023 9:17 AM ISTనకిలీ బర్త్ సర్టిఫికెట్లతో బ్యాడ్మింటన్ క్రీడలో భారీ స్కామ్.. రంగంలోకి పోలీసులు
హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారులు కొత్తరకం మోసానికి తెరలేపారు. వయస్సు తగ్గించి పిన్న వయస్కులతో పోటీ పడుతున్నారు. నకిలీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లతో బ్యాట్మింటెన్ క్రీడకారులు చేస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌కు సంబంధించిన సమాచారాన్ని సిటీ సీసీఎస్ పోలీసులకు ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ ద్వారా అందజేశారు. దీనిపై హైదరాబాద్ సిటీ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు తెలిసే ఈ గోల్‌మాల్ వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తోంది. కోచ్‌ల సలహా మేరకు అత్యాశతో కొందరు తల్లిదండ్రులు నకిలీ పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను సంపాదించడానికి అక్రమ మార్గాలను ఆశ్రయించారని, బీఏఐ (బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా)కి ఇవే దాఖలు చేస్తూ తమ కంటే చిన్న వారితో పోటీల్లోకి దిగుతున్నారని ఫిర్యాదుదారు ఆరోపించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకర్లు, గోల్డ్ మెడలిస్టులు సైతం ఈ రకం మోసానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురి విషయంలో రూఢీ జరిగింది. మరో 40 మంది ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు తెలంగాణ బ్యాట్మింటెన్ అసోసియేషన్‌లకు హైదరాబాద్ పోలీసులు లేఖ రాశారు. దీనిపై రెండు నెలలు దాటినా ఇప్పటి వరకు అసోసియేషన్ స్పందించలేదు.
కొందరు బ్యాడ్మింటన్ క్రీడకారులు అసలు వయస్సు కంటే తక్కువ వయస్సు రుజువులను సమర్పించి ఆడుతున్నారని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై స్పందించాలని తెలంగాణ బ్యాట్మింటెన్ అసోసియేషన్‌కు పోలీసులు లేఖ రాశారు. ఎక్కువ వయస్సు ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో కొందరు నకిలీ పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను సమర్పించి, పతకాలు, అనేక జాతీయ ర్యాంక్‌లను గెలుచుకోవడం ద్వారా టోర్నమెంట్‌లలో పాల్గొంటున్నారని, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో అసలైన ఆటగాళ్లకు అవకాశాలు తగ్గడంతో వారిలో రోజు రోజుకు ఉత్సాహం తగ్గుతోందని పేర్కొన్నారు. ఈ విషయంలో వయస్సు పైబడిన ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని, నిజమైన ఆటగాళ్లకు న్యాయం చేయాలని బీఏఐలో ఇప్పటికే చాలా ఫిర్యాదులు నమోదయ్యాయి. కానీ వారిపై సరైన చర్యలు తీసుకోవడం లేదు.
బ్యాడ్మింటన్ క్రీడాకారులు దావు వెంకట శివ నాగ రామ్ మౌనీష్, భూక్య నిషాత్, ఎ.ఆర్.రోహన్ కుమార్, హిమబిందు శ్యామలారావు, రేణుశ్రీ శ్యామలారావు, దీప్తిక నేరేడిమిల్లిలు నకిలీ పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను బీఏఐకి సమర్పించారని, వీళ్లే కాకుండా మరో 40 మంది అనుమానాస్పదంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. 2005 నుంచి 2010 మధ్య జన్మించిన వారిలో చాలా మంది క్రీడాకారులు ఈ మోసానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రకంగా చాలా మంది బ్యాడ్మింటన్ క్రీడాకారులు అనవసర ప్రయోజనాలు పొందుతున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అజ్ఞాత పిటిషనర్ కోరారు. పిటిషనర్ ఆటగాళ్ల వివరాలతో పాటు, వారి నకిలీ పుట్టిన తేదీ వివరాలను సమర్పించి చర్యలు తీసుకోవాలని పోలీసులను అభ్యర్థించారు. దీంతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు జరిపిన విచారణలో ముగ్గురు నిజంగానే నకిలీ సర్టిఫికెట్లతో మోసానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అండ్ ఏపీ బ్యాడ్మింటెన్ అసోసియేషన్‌ని సీసీఎస్ పోలీసులు కోరారు.