Video : సంచ‌ల‌నం.. 52కు 2 వికెట్లు.. 53కు ఆలౌట్‌..!

పెర్త్‌లోని WACAలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా, టాస్మానియా మధ్య జరిగిన ఆస్ట్రేలియా వన్-డే కప్ మ్యాచ్‌లో ఒక ప‌రుగు చేసి చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయింది

By Medi Samrat  Published on  25 Oct 2024 4:03 PM IST
Video : సంచ‌ల‌నం.. 52కు 2 వికెట్లు.. 53కు ఆలౌట్‌..!

పెర్త్‌లోని WACAలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా, టాస్మానియా మధ్య జరిగిన ఆస్ట్రేలియా వన్-డే కప్ మ్యాచ్‌లో ఒక ప‌రుగు చేసి చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయింది. కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, జోష్ ఇంగ్లిస్ వంటి ఆస్ట్రేలియన్ అంతర్జాతీయ ఆటగాళ్లు పుష్కలంగా ఉన్న‌ప్పటికీ.. చివరి ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ల‌లో ఒక్క‌రు కూడా ఒక్క పరుగు కూడా నమోదు చేయలేదు. ఆరుగురు డకౌట్ అయ్యారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 52/2 కాగా.. ఒక్క ప‌రుగు మాత్ర‌మే జోడించి నిమిషాల వ్య‌వ‌ధిలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 53/10కి చేరుకుంది.

కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ అవుట్ అయిన త‌ర్వాత 28-బంతుల వ్యవధిలో మిగ‌తా బ్యాట్స్‌మెన్ అంతా డ్రెస్సింగ్ రూమ్‌కి క్యూ క‌ట్టారు. టాస్మానియాకు చెందిన బ్యూ వెబ్‌స్టర్ విధ్వంసకర బౌలింగ్‌తో 6 వికెట్లు పడగొట్టాడు. చివరి 8లో 5 వికెట్లు త‌నే పడగొట్టాడు. మరో ఎండ్ నుండి బిల్లీ స్టాన్‌లేక్ కూడా 3 వికెట్లు తీశాడు. టామ్ రోజర్స్ ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్‌గా ఆరోన్ హార్డీని అవుట్ చేశాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా 52 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయింది. ఆ త‌ర్వాత‌ 14 బంతుల్లో 52-2 నుండి 52-7కి చేరుకుంది.

ఇన్నింగ్స్ ప్రారంభంలో ఆరోన్ హార్డీని కోల్పోయినప్పటికీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా వాస్తవానికి మంచి ప్రారంభాన్ని పొందింది. బాన్‌క్రాఫ్ట్, డి'ఆర్సీ షార్ట్ కలిసి జట్టు స్కోరును 45/1కి చేర్చారు. కానీ డి'ఆర్సీ షార్ట్ ఆ సమయంలో అవుట్ అయ్యాడు. ఆ భాగస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడం వలన టాస్మానియాకు మంచి అవకాశం లభించింది. అయితే ఈ ర‌క‌మైన పతనం మాత్రం ఏ ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు ఊహించదు.

ఆ త‌ర్వాత టాస్మానియా 50 ఓవర్లలో 54 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా.. లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. అయితే.. టాస్మానియా ఇన్నింగ్సులో కూడా 33-0 ఉండ‌గా 34-3 వికెట్లు త్వర‌గా ప‌డ‌టంతో స్వల్ప ఆందోళన ఉన్నా కోలుకుని విజ‌యాన్ని ద‌క్కించుకుంది. మాథ్యూ వేడ్ 13 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స‌ర్ సాయంతో 21 ప‌రుగులు చేసి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. అయితే ఆస్ట్రేలియా వన్-డే కప్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది.

Next Story