ముంబై ఖాతాలో 42వ రంజీ ట్రోఫీ

రంజీ ట్రోఫీ 2024 టైటిల్‌ని ముంబై దక్కించుకుంది.

By Srikanth Gundamalla  Published on  14 March 2024 4:28 PM IST
42nd Ranji Trophy,  Mumbai, cricket,

ముంబై ఖాతాలో 42వ రంజీ ట్రోఫీ 

రంజీ ట్రోఫీ 2024 టైటిల్‌ని ముంబై దక్కించుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రంజీ ట్రోఫీ-2024 ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ముంబై టీమ్‌ ఫైనల్‌లో విదర్భపై ఘన విజయం సాధించింది. 169 పరుగుల తేడాతో కప్‌ను సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై జట్టు 224 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. శార్దూల్‌ ఠాకూర్‌ 69 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. టాప్‌ స్కోరర్‌గా నిలిచాడ. 176 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ముంబై జట్టుని శార్దూల్ ఠాకూర్‌ ఆదుకున్నాడు. ఇక విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

తర్వాత ముంబై జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 418 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ముశీర్‌ ఖాన్ 326 బంతుల్లో 10 ఫోర్లతో 136 పరుగులు చేయగా.. కెప్టెన్ అజింకా రహానే 143 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 73 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్‌ 111 బంతుల్లో పది ఫోర్లు, 3 సిక్స్‌లతో 95 పరుగులు చేశాడు. శామ్స్ ములానీ 50 పరుగులు చేశాడు.

ఇక 538 పరుగుల భారీ టార్గెట్‌తో విదర్భ జట్టు బరిలోకి దిగింది. 134.3 ఓవర్లు ఆడి 368 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అదర్వ 32, ధృవ్ షోరే 28, ఆమన్ మొకడే 32, పరుగులు చేయగా కరణ్ నాయర్ 220 బంతుల్లో 3 ఫోర్లతో 74 పరుగులు చేశాడు. 199 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 102 పరుగులు చేసిన విదర్భ కెప్టెన్ అక్షయ్ వాడ్కర్... హర్ష్ దుబేతో కలిసి 43 ఓవర్ల పాటు వికెట్ పడకుండా అడ్డుగా నిలిచాడు. 128 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేసిన హర్ష్ దుబే, అక్షయ్ అవుటైన తర్వాత కొద్దిసేపటికే అవుట్ అయ్యాడు. ఆదిత్య, యష్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ కూడా వెంటవెంటనే అవుట్ కావడంతో విదర్భ ఇన్నింగ్స్ ముగిసింది. తద్వారా ముంబై ఖాతాలో 42వ రంజీ ట్రోఫీ చేరింది.

ఇక ముంబై ఆల్‌రౌండర్‌ తనుష్‌ కొట్టియన్‌ ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ముశీర్ ఖాన్ ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. ముంబై 42వ సారి రంజీ టైటిల్‌ను గెలిచింది. కర్ణాటక 8 సార్లు, ఢిల్లీ 7 సార్లు రంజీ టైటిల్స్‌ను గెలుచుకున్నాయి.

Next Story