ఆ మూడు త‌ప్పులు చేయ‌డంతో పంత్‌ కెప్టెన్సీపై ప్రశ్నలు

ఐపీఎల్ 18వ సీజన్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు ప‌రాజయంతో ప్రారంభించింది.

By Medi Samrat
Published on : 25 March 2025 5:49 PM IST

ఆ మూడు త‌ప్పులు చేయ‌డంతో పంత్‌ కెప్టెన్సీపై ప్రశ్నలు

ఐపీఎల్ 18వ సీజన్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు ప‌రాజయంతో ప్రారంభించింది. రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో జట్టు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. లక్నో విజయం ఖాయం అనిపించినా.. అశుతోష్ శర్మ త‌న బ్యాటింగ్‌తో ఢిల్లీ జట్టును గెలిపించి ఆశ్చర్యపరిచాడు. అయితే కెప్టెన్ పంత్ చేసిన మూడు పెద్ద తప్పులు కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించాయి.

పంత్ ఈ తప్పులు చేయకుంటే లక్నో విజయంతో ఆరంభమై ఢిల్లీకి ఓటమి ఎదురయ్యేది. నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ చెలరేగడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ 19.3 ఓవర్లలోనే సాధించింది.

పంత్ చేసిన మూడు పెద్ద తప్పులు

1. చివరి ఓవర్లో ఢిల్లీకి ఆరు పరుగులు కావాలి. మోహిత్ శర్మ క్రీజులో ఉన్నాడు. షాబాజ్ అహ్మద్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఆ ఓవర్ మొద‌టి బంతికి మోహిత్‌ను అహ్మద్ అవుట్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. అహ్మద్ వేసిన బంతిని మోహిత్ మిస్ చేయడంతో పంత్ అతనిని స్టంప్ చేసే అవకాశం దొరికింది. కానీ పంత్ ఆ అవ‌కాశాన్ని స‌రిగ్గా వినియోగించుకోలేదు. ఇదే చివరి వికెట్ కాగా పంత్ స్టంపౌట్ చేసి ఉంటే లక్నో మ్యాచ్ గెలిచి ఉండేది.

2. లక్నో ఢిల్లీకి శుభారంభం ద‌క్క‌నివ్వ‌లేదు. దీనికి శార్దూల్ ఠాకూర్ కారణం. ఠాకూర్ తొలి ఓవర్లలోనే ఢిల్లీని ఇబ్బంది పెట్టి రెండు వికెట్లు పడగొట్టాడు. అతడి తొలి ఓవర్‌లోనే జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్‌ని అవుట్ చేశాడు. అలాగే అభిషేక్ పోరెల్‌ను కూడా అవుట్ చేశాడు. కానీ పంత్ రెండు ఓవర్లు వేసిన త‌ర్వాత‌ ఠాకూర్‌కి బౌలింగ్ ఇవ్వ‌లేదు. ఠాకూర్‌ను చివరి ఓవర్లు బౌలింగ్ చేసేలా చేసి ఉంటే వికెట్లు పడే అవకాశం ఉండేది.

3. ఒకానొక సమయంలో 19 బంతుల్లో 19 పరుగులు చేసి ఆడుతున్న అశుతోష్ శర్మ ఢిల్లీ విజయానికి హీరో అయ్యాడు. ఇక్కడి నుంచి యాక్సిలరేటర్‌పై అడుగుపెట్టి దూసుకెళ్లాడు. అయితే 15వ ఓవర్ ఆఖరి బంతికి పంత్ అశుతోష్ క్యాచ్‌ని వదులకుంటే అతడు అప్పటికే పెవిలియన్‌కు చేరి ఉండేవాడు. అహ్మద్ వేసిన బంతిని కట్ చేయడానికి వెళ్లిన అశుతోష్ బ్యాట్‌ వెలుపలి అంచును బంతి తాకింది, కానీ పంత్ దానిని కూడా పట్టుకోలేకపోయాడు. అలా మ్యాచ్‌లో త‌ప్పుల మీద త‌ప్పులు చేశాడు పంత్‌.

విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత లక్నోకు చెందిన మార్ష్‌, పురాణ్ చెల‌రేగారు. మార్ష్ 36 బంతుల్లో ఆరు ఫోర్లు, సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. అతని కంటే పురాణ్ మరింత దూకుడుగా ఆడాడు. 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. ఆ త‌ర్వాత అశుతోష్ 31 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో అజేయంగా 61 పరుగులు చేసి ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు. అయితే ఈ విజయంలో 15 బంతుల్లో 39 పరుగులు చేసిన విప్రజ్ నిగమ్ సహకారం మరువలేనిది. అశుతోష్‌తో కలిసి అతను 22 బంతుల్లో 55 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.. ఈ భాగస్వామ్యం ఆధారంగా ఢిల్లీ మ్యాచ్‌లో పునరాగమనం చేసింది.

Next Story