వన్డే వార్.. ఆసీస్‌తో భారత్ తొలి వన్డే నేడే
వాంఖడే వేదికగా నేడు భారత్, ఆస్ట్రేలియా జట్లు తొలి వన్డే మ్యాచ్‌లో తలపడనున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 17 March 2023 4:00 AM GMTప్రాక్టీస్ చేస్తున్న విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా
సొంతగడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫిని గెలుపొందిన టీమ్ ఇండియా అదే జోష్‌లో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా వాంఖడే వేదికగా నేడు భారత్, ఆస్ట్రేలియా జట్లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమ్ఇండియా అతి కొద్ది వన్డే మ్యాచులు మాత్రమే ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ను ప్రపంచకప్ కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలని టీమ్ఇండియా బావిస్తోంది.
వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాగా.. అతడి స్థానంలో ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా జట్టును నడిపించనున్నాడు. ఇటీవలే పేలమ ఫామ్ నుంచి బయటపడిన పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తనదైన శైలిలో చెలరేగి పరుగులు సాధించాలని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉండడం కలిసి వచ్చే అంశం. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉంది.
మూడో స్థానంలో కోహ్లీ ఆడనుండగా నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు దిగనున్నాడు. పేలవ ఫామ్ కారణంగా ఆసీస్‌తో చివరి రెండు టెస్టులకు జట్టులో చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా మిడిలార్డర్‌లో స్థానం దక్కొచ్చు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలతో భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తోంది. మహమ్మద్ సిరాజ్, షమీ, శార్దూల్ ఠాకూర్ పేస్ బాధ్యతలు మోయనున్నారు. రెండో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.
రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ వన్డే సిరీస్‌కు దూరం కావడంతో స్టీవ్ స్మిత్ నాయకత్వంలోనే ఆసీస్ బరిలోకి దిగనుంది. గాయాల నుంచి కోలకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్, మిషెల్ మార్ష్ రాకతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం పటిష్టంగా మారింది. పేసర్లు హేజిల్‌వుడ్, జేరిచర్డ్‌సన్ లు అందుబాటులో లేకపోయినా స్టార్క్, గ్రీన్‌ల రూపంలో నాణ్యమైన పేసర్లు ఆసీస్ సొంతం. వీరికి తోడుగా ఎలిస్ ఉన్నాడు. స్పిన్ విభాగాన్ని జంపా నడిపించనున్నాడు.
వాంఖడే పిచ్‌లో పెద్దగా జీవం ఉండదు. మ్యాచ్ సాగుతున్న కొద్ది బ్యాటర్లు పండుగ చేసుకోవచ్చు. దీంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.