World Cup: భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్‌కు బెదిరింపులు.. పోలీసుల అదుపులో 17 ఏళ్ల యువకుడు
వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భాగంగా ఇవాళ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీ-ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌కు బెదిరింపు సందేశం వచ్చింది.
By అంజి Published on 15 Nov 2023 12:29 PM ISTWorld Cup: భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్‌కు బెదిరింపులు.. పోలీసుల అదుపులో 17 ఏళ్ల యువకుడు
వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భాగంగా ఇవాళ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీ-ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ జరిగే సమయంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంటుందంటూ ఓ ఆగంతుకుడు ఎక్స్‌లో బెదిరింపులకు పాల్పడ్డాడు. అజ్ఞాత యూజర్ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ.. తుపాకీ, హ్యాండ్ గ్రనేడ్, బుల్లెట్ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ హెచ్చరించాడు. ఎక్స్‌లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు సందేశం రావడంతో ముంబై పోలీసులు గట్టి నిఘాను అమలు చేస్తున్నారు. బెదిరింపు సందేశం రావడంతో వాంఖడే స్టేడియం చుట్టూ భద్రతా చర్యలు పెంచినట్లు ముంబై పోలీసులు బుధవారం తెలిపారు.
క్రికెట్ ప్రపంచకప్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఈరోజు దారుణ సంఘటన చోటు చేసుకుంటుందని వచ్చిన సందేశం పట్ల ముంబై పోలీసులు ప్రేక్షకులను హెచ్చరించారు. ఈ సందేశానికి సంబంధించి లాతూర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల యువకుడిని క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా బెదిరింపు సందేశం వెనుక ఉన్న వ్యక్తి యొక్క ఉద్దేశ్యాలు తెలుసుకునేందుకు పోలీసులు ఈ విషయాన్ని చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. "అతను బెదిరింపు సందేశాన్ని ఎందుకు పోస్ట్ చేసాడు అనేది ఇంకా నిర్ధారించబడలేదు" అని పోలీసులు తెలిపారు.
మ్యాచ్‌కు హాజరయ్యే ప్రేక్షకులు మెరుగైన భద్రత కోసం పోలీసులకు సహకరించాల్సి ఉంటుంది. కాగా, గతంలోనూ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లకు ఇదేవిధంగా బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ 14న అహ్మదాబాద్ లో జరిగిన భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా ఇలాగే బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. నేటి మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జరగనుంది. ఈ పిచ్‌పై పరుగుల వరద ఖాయమని మాజీలు అంచనా వేస్తున్నారు. గత ప్రపంకప్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు రోహిత్ సేన సిద్ధంగా ఉంది.