ఒకే ఇన్నింగ్స్‌లో 16 సిక్సర్లు.. మూడుసార్లు బంతిని మార్చిన అంపైర్లు..!
న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్ పాక్ బౌలర్లను చిత్తు చేసి ప్రపంచ రికార్డును సమం చేశాడు.
By Medi Samrat Published on 17 Jan 2024 10:18 AM GMTన్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్ పాక్ బౌలర్లను చిత్తు చేసి ప్రపంచ రికార్డును సమం చేశాడు. బుధవారం డునెడిన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మూడో టీ20 ఇంటర్నేషనల్‌లో అలెన్ కేవలం 62 బంతుల్లో 137 పరుగులు చేసి రికార్డు పుస్తకాల్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌గా అలెన్ నిలిచాడు. అంతకుముందు బ్రెండన్ మెకల్లమ్(123) పేరిట ఈ రికార్డు ఉండేది. అంతేకాదు ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డును సమం చేశాడు.
ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన హజ్రతుల్లా జజాయ్ 16 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు ఫిన్ అలెన్ కూడా అతని రికార్డును సమం చేశాడు. ఫిబ్రవరి 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హజ్రతుల్లా జజాయ్ 62 బంతుల్లో 162 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో అతను 11 ఫోర్లు, 16 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు ఫిన్ అలెన్ 62 బంతుల్లో 137 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్సులో ఐదు ఫోర్లు, 16 సిక్సర్లు బాదాడు.
అలెన్.. హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో రెచ్చిపోయాడు. రౌఫ్ వేసిన ఒక ఓవర్‌లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో 27 పరుగులు చేశాడు. అలెన్ ఇన్నింగ్స్ దాటికి న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌కు 225 పరుగులకు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో గెలుపొంది న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కివీస్ జట్టు 3-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.
ఏడు పరుగుల వద్ద డెవాన్ కాన్వేను త్వరగా ఔట్ చేసిన తర్వాత టిమ్ సీఫెర్ట్‌తో కలిసి అలెన్ రెండో వికెట్‌కు 125 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అలెన్ ఇన్నింగ్స్‌లో అంపైర్లు మూడుసార్లు బంతిని మార్చడం అతని దూకుడు బ్యాటింగ్‌కు నిదర్శనం. దీన్ని బట్టి అతను బంతిని ఎంత శక్తివంతంగా కొట్టాడో అర్థం చేసుకోవచ్చు. అలెన్ అద్భుత ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ముగిసింది. అతను జమాన్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అలెన్ ఔటయ్యాక జమాన్ ఖాన్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. మైదానం నుండి పెవిలియన్‌కు వెళుతున్న అలెన్‌ను ప్రశంసించాడు.