ఐపీఎల్ మెగా వేలానికి ఎంత మంది ద‌ర‌ఖాస్తు చేస్తుకున్నారో తెలుసా..?

1214 Players register for IPL 2022 Player Auction.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) కు ఉన్న క్రేజ్ మామూలుది కాదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Jan 2022 8:56 AM GMT
ఐపీఎల్ మెగా వేలానికి ఎంత మంది ద‌ర‌ఖాస్తు చేస్తుకున్నారో తెలుసా..?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) కు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. కాసుల వ‌ర్షం కురిపించే ఐపీఎల్‌లో ఆడేందుకు పెద్ద పెద్ద స్టార్ ఆట‌గాళ్ల‌తో పాటు యువ క్రికెట‌ర్లు కూడా ఉత్సాహాం చూపిస్తుంటారు. ఐపీఎల్ 2022లో మ‌రో రెండు కొత్త జ‌ట్లు రానున్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే నెల‌లో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మెగా వేలాన్ని నిర్వ‌హించినుంది. ఇప్ప‌టికే ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలు ఆట‌గాళ్ల‌ను రిటెయిన్ చేసుకోగా.. కొత్త జ‌ట్లు ముగ్గురు ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసుకున్నాయి.

ఇక ఐపీఎల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక్కో జ‌ట్టు 25 మంది ఆట‌గాళ్ల‌ను తీసుకోవ‌చ్చు. ఆ లెక్క‌న మొత్తం 250 మంది ఆట‌గాళ్లు ఎంచుకునే అవ‌కాశం ఉండ‌గా.. రీటైన్ చేసుకున్న ఆట‌గాళ్లు పోనూ ప్ర‌స్తుతం 217 మంది ఆట‌గాళ్ల‌ను వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది. కాగా.. 217 స్థానాల కోసం మొత్తం 1214 మంది ఆట‌గాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలో 896 మంది భార‌త ఆట‌గాళ్లు కాగా.. 318 మంది విదేశీ ఆట‌గాళ్లు. ఇందులో 270 మంది క్యాప్‌డ్‌(జాతీయ జ‌ట్టుకు త‌రుపున ఆడిన వారు), కాగా.. 903 మంది ఆన్‌క్యాప్‌డ్(జాతీయ జ‌ట్టుకు ఆడ‌ని వారు), 41 మంది అసోసియేట్ ఆట‌గాళ్లు ఉన్నారు.

విదేశీ ఆట‌గాళ్ల‌లో అత్య‌ధికంగా 59 మంది ఆస్ట్రేలియా నుంచి ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. ఆ త‌రువాత ద‌క్షిణాఫ్రికా-48, శ్రీలంక‌-36, ఇంగ్లాండ్-30, న్యూజిలాండ్‌-29, అఫ్గానిస్థాన్‌-20, నేపాల్‌-15, యూఎస్ఏ-14, న‌మీబియా-5, ఒమ‌న్‌-3 భూటాన్‌-1, యూఏఈ-1, ఆటగాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 12,13 తేదీల్లో మెగా వేగం జ‌ర‌గ‌నుంది. వీరిలో అదృష్ట‌వంతులు ఎవ‌రు అనేది ఆరోజు తేలిపోనుంది.

Next Story
Share it