భార‌త్-శ్రీలంక తొలి వ‌న్డే.. రికార్డ్స్ ఇవే

10 Big Records Made in the First ODI.శ్రీలంకతో వ‌న్డే సిరీస్‌ను టీమ్ఇండియా ఘ‌నంగా ఆరంభించింది. కెప్టెన్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 July 2021 3:22 PM IST
భార‌త్-శ్రీలంక తొలి వ‌న్డే.. రికార్డ్స్ ఇవే

శ్రీలంకతో వ‌న్డే సిరీస్‌ను టీమ్ఇండియా ఘ‌నంగా ఆరంభించింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (86 నాటౌట్‌; 95 బంతుల్లో 6పోర్లు, 1సిక్స్‌), యువ ఓపెనర్ పృథ్వీ షా (43; 24 బంతుల్లో 9పోర్లు), హిట్టర్ ఇషాన్‌ కిషన్‌ (59; 42 బంతుల్లో 8పోర్లు, 2సిక్స్‌లు) చెలరేగడంతో ఆదివారం తొలి వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువకులు సత్తాచాటడంతో భారత్‌ 36.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ప‌లు రికార్డులు న‌మోదు అయ్యాయి. ఆ రికార్డులు ఏంటంటే..?

* వ‌న్డేల్లో భారత జట్టుకి నాయకత్వం వహించిన 25వ కెప్టెన్‌గా శిఖ‌ర్ ధావ‌న్ రికార్డుల్లోకి ఎక్కాడు. దీంతో లేటు వయసులో జట్టు పగ్గాలు అందుకున్న భారత కెప్టెన్‌గా గబ్బర్ నిలిచాడు. 35 సంవత్సరాల 225వ రోజు ధావన్ టీమియా పగ్గాలు అందుకున్నాడు. దీంతో 1984లో తొలిసారిగా భారత జట్టుకు నాయకత్వం వహించిన మొహిందర్ అమర్‌నాథ్ రికార్డును బద్దలు కొట్టాడు. పాకిస్థాన్‌పై 34 సంవత్సరాల 37 రోజుల వయసులో అమర్‌నాథ్ తొలిసారిగా టీమిండియాకు నాయకత్వం వహించాడు. సయ్యద్ కిర్మానీ (33 సంవత్సరాల 353 రోజులు), అజిత్ వాడేకర్ (33 సంవత్సరాలు 103 రోజులు)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

* శిఖర్ ధావన్ వన్డేలో 6000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన పదో భారత బ్యాట్స్​మన్​గా నిలిచాడు గబ్బర్​. 6000 పరుగులు పూర్తిచేయడానికి ధావన్​ 140 ఇన్నింగ్స్​లు తీసుకున్నాడు. వివ్​ రిచర్డ్స్​, జో రూట్ (వీరిద్దరూ 141 ఇన్నింగ్స్​లు)​లను వెనక్కి నెట్టాడు. హషీమ్​ ఆమ్లా (123 ఇన్నింగ్స్​లు), విరాట్ కో హ్లీ(136 ఇన్నింగ్స్​లు), కేన్ విలియమ్సన్ ​(139 ఇన్నింగ్స్​లు) అతడి కంటే ముందున్నారు. ఈ జాబితాలో భారత్ తరఫున కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. గబ్బర్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 147 ఇన్నింగ్స్‌లలో 6000 వన్డే పరుగులు సాధించాడు.

* హాఫ్​ సెంచరీతో రాణించిన శిఖర్ ధావన్​ శ్రీలంకపై వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. 17 ఇన్నింగ్స్​ల్లోనే 1000 రన్స్ చేశాడు. భారత మాజీ కెప్టెన్ గంగూలీ ఇందుకు​ 20 ఇన్నింగ్స్​లు తీసుకున్నాడు. ఈ క్రమంలో దాదా రికార్డును తిరగరాశాడు.

* వ‌న్డేలో 33వ అర్ధ శతకం సాధించిన శిఖర్ ధావన్​.. అంతర్జాతీయ కెరీర్​లో 10వేల మార్క్​ను అందుకున్నాడు. ఈ ఘనత అందుకున్న 14వ భారత బ్యాట్స్​మన్​ గబ్బర్.

* కెప్టెన్‌గా ఆడిన తొలి వన్డేలో 50 ప్లస్‌ పరుగులు చేసిన శిఖర్‌ ధావన్‌ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా ఆడిన తొలి వన్డేలోనే 50 ప్లస్‌ పరుగులు చేసిన ఐదో భారతీయ క్రికెటర్‌గా శిఖర్‌ నిలిచారు. శిఖ‌ర్ క‌న్నా ముందు అజిత్‌ వాడేకర్‌, రవిశాస్త్రి, సచిన్‌, అజయ్‌ జడేజా ఉన్నారు. కెప్టెన్‌గా ధోని రెండో వన్డేలో 50 ప్లస్‌ పరుగులు సాధించాడు.

* ఇది భార‌త్‌-శ్రీలంక మధ్య జరిగిన 160 వ మ్యాచ్ కాగా.. శ్రీలంకపై 92 విజయాలు నమోదు చేసి కొత్త రికార్డును నమోదు చేసింది. పాకిస్తాన్‌ కూడా శ్రీలంకపై 155 మ్యాచులు ఆడి 92 విజయాలు నమోదు చేసుకున్నది.

* ఇషాంత్‌ కిషన్‌ కొత్త రికార్డును తన పేరిట రాసుకున్నాడు. అరంగ్రేటం చేసిన‌ వన్డేతో పాటు టీ20 లో హాఫ్‌ సెంచరీ చేసిన రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 42 బంతులను ఎదుర్కొన్న ఇషాంత్‌ కిషన్‌ 59 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 లో ఇషాంత్‌ కిషన్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు.

* శ్రీలంకను 9 వరుస మ్యాచుల్లో ఓడించి టీమిండియా కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ రికార్డును ఇంతవరకు ఏ టీం సాధించలేదు. 4 వరుస మ్యాచుల్లో గెలుపొంది దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉన్నది.

* పవర్‌ ప్లేలో పెద్ద స్కోర్‌ నమోదు చేసిన జట్టుగా ఇండియాకు కొత్త రికార్డు వచ్చింది. తొలి 10 ఓవర్లలో ఇండియా వికెట్‌ నష్టపోయి 91 పరుగులు చేసింది. 2013 నుంచి ఇదే హయ్యెస్ట్ స్కోర్‌. 2019 లో వెస్టిండీస్‌పై పవర్‌ ప్లేలో ఇండియా 83 పరుగులు చేసింది.

* ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ కూడా హాఫ్‌ సెంచరీ చేయకుండా శ్రీలంక పెద్ద స్కోర్‌ నమోదు చేయడం విశేషం. 9 వికెట్లు కోల్పోయిన శ్రీలంక 262 పరుగులు చేసింది. గతంలో హాఫ్‌ సెంచరీలు లేకుండా శ్రీలంక జట్టు (పాకిస్తాన్‌ జట్టుపై 2006లో ) 253 పరుగులు చేసింది.

Next Story