హైదరాబాద్‌కే స్వర్ణ విజేత సింధు

By అంజి  Published on  27 Nov 2019 3:13 AM GMT
హైదరాబాద్‌కే స్వర్ణ విజేత సింధు

ముఖ్యాంశాలు

  • 2020 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు పీబీఎల్‌ ఐదో సీజన్‌ పోటీలు
  • రూ.77 లక్షలకు పీ.వీ సింధును సొంతం చేసుకున్న హైదరాబాద్‌

ఢిల్లీ: 2020 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు పీబీఎల్‌ ఐదో సీజన్‌ పోటీలు జరగనున్నాయి. ప్రీమియర్ బ్యాడ్మింటన్‌ లీగ్‌ వేలం పాటలో హైదరాబాద్‌ హంటర్స్‌ జట్టు రూ.77 లక్షలకు పీ.వీ సింధును సొంతం చేసుకుంది. పీబీఎల్‌ ఐదో సీజన్‌ కోసం ప్లేయర్ల వేలం కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌తో కలిసి గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్న సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. 19 ఏండ్ల సాత్విక్‌ను చివరికి రూ.62 లక్షలు వెచ్చింది చెన్నై సూపర్‌ స్టార్స్‌ జట్టు సొంతం చేసుకుంది. భారత బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కుమార్తె గాయత్రిని రూ.2 లక్షలకు చెన్నై సూపర్‌స్టార్స్‌ దక్కించుకుంది.

వరల్డ్‌ టాంప్‌ ర్యాంక్‌ మహిళా షట్లర్‌ తై జూ యింగ్‌ (చైనా)ను రూ.77 లక్షల గరిష్ట ధరతో డిఫెండింగ్ చాంపియన్స్‌ బెంగళూరు రాప్టర్స్‌ తీసుకోగా... ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత సాయి ప్రణీత్‌ను రూ.32లక్షలతో రిటైన్‌ చేసుకుంది. తెలంగాణ యువ షట్లర్‌ ఎన్‌ సిక్కిరెడ్డిని రూ.20 లక్షలకు హైదరాబాద్‌ హంటర్స్‌ దక్కించుకుంది. 74 మంది ప్లేయర్లు పీబీఎల్‌ వేలంలో పాల్గొన్నారు. డబుల్‌ స్టార్‌ షట్లర్‌ అశ్వినీ పొన్నప్పై ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. వచ్చే సంవత్సరం ఇంటర్నేషనల్‌ టోర్నీల కోసం సిద్ధమయ్యేందుకు సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్‌ ఐదో పీబీఎల్‌ సిజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఒక్కో జట్టులో ఆరుగురు విదేశీ ప్లేయర్లు, కనీసం ముగ్గురు మహిళా షట్లర్లు ఉండాలి. గరిష్టంగా ఒక్కో ప్లేయర్‌కు రూ.77 లక్షలు చెల్లించే అవకాశం ఉంది. కాగా బెంగళూరు, హైదరాబాద్‌, లక్నో, చెన్నై వేదికగా పీబీఎల్‌ టోర్నీ జరగనుంది.

Next Story