బంగ్లాదేశ్‌తో జ‌రిగిన‌ పింక్‌బాల్ టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ విజయం సాధించడంతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ విజ‌యంతో టీమిండియా వరుసగా నాలుగో ఇన్నింగ్స్‌ విజయం సాధించిన జ‌ట్టుగా నూత‌న రికార్డ్ న‌మోదుచేసింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఒక జట్టు ఇలా వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ విజయాలు సాధించడం ఇదే మొదటిసారి. అంతకుముందు భారత్‌ జట్టు.. బంగ్లాదేశ్‌ జరిగిన తొలి టెస్టును ఇన్నింగ్స్‌ తేడాతో గెలవగా, అంత‌కుముందు జ‌రిగిన‌ దక్షిణాఫ్రికా సిరీస్‌లో కూడా వరుస రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజ‌యాల‌ను సాధించింది.

ఇదిలావుంటే.. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన‌ పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా బంగ్లాపై ఘ‌న‌విజ‌యం సాధించింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టులోనూ ఇన్నింగ్స్ విజ‌యం అందుకుంది. బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే క‌ట్ట‌డి చేసిన టీమిండియా.. ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో విజయం​ సాధించింది.

ఆదివారం మూడో రోజు ఆట ప్రారంభించిన‌ బంగ్లాదేశ్‌.. ఇన్నింగ్స్‌ను గంటసేప‌ట్లోనే ముగించింది. ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు తైజుల్‌ ఇస్లామ్‌(11), ముష్పికర్‌ రహీమ్‌(74)లతో పాటు ఎబాదత్‌ హుస్సేన్‌(0)ల‌ను ఉమేశ్‌ యాదవ్‌ ఔట్‌ చేయడంతో బంగ్లాదేశ్‌ 184 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. మూడో రోజు ఆట‌లో బంగ్లా కేవ‌లం 43 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story