ఏపీ సర్కార్‌ సంచలనాత్మక నిర్ణయాలతో పాలన సాగిస్తుంది. సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటినుంచి ప్రతీ నిర్ణయం సంచలనంగానే మారుతుంది. మూడు రాజధానుల నిర్ణయంకు తోడు.. రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్టణానికి తరలించటం వంటి అంశాలు తెలంగాణకు కలిసొచ్చే అంశాలుగా మారాయి. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీఎం జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయంతో తెలంగాణలోని లిక్కర్‌ వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులతో పాటు.. తెలంగాణ ప్రభుత్వానికి మద్యం విక్రయాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఈనెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో 12 నుంచి 29వరకు ఏపీలో మద్యం దుకాణాలను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ సరిహద్దుల్లో వైన్‌షాపుల కళకళలాడనున్నాయి. ఇప్పటికే ఏపీలో మద్యం ధరలు పెంచడంతో తెలంగాణ సరిహద్దు ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ఏపీకి మద్యం తరలుతుంది. దీనికితోడు జగన్‌ తాజాగా తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలోని మద్యం వ్యాపారులు ఖుషీ అవుతున్నారు.

సుమారు 18రోజుల పాటు ఏపీలో ఎన్నికల హడావుడి తారాస్థాయిలో ఉంటుంది. ఇదే సమయంలో మద్యం సరఫరా నిలిపివేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో ఏపీలో పలు ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులు, పార్టీల నేతలు తెలంగాణ నుంచి మద్యాన్ని తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణలో ఈ ఇరవై రోజులు మద్యం విక్రయాల అమ్మకాలు తారాస్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ సరిహద్దుకు సమీపంలో ఉన్న తెలంగాణ జిల్లాల్లో దాదాపు 538 లిక్కర్‌ షాపులకు ఈ నెల రెట్టింపు మద్యాన్ని ఎక్సైజ్‌ అధికారులు సప్లయ్‌ చేయనున్నట్లు సమాచారం.

కొత్త జిల్లాల పరంగా ఎనిమిది జిల్లాలు ఏపీకి సరిహద్దుగా ఉన్నాయి. ప్రతినెల ఈ జిల్లాల నుంచి దాదాపు రూ. 550 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఏపీలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ 18రోజులు రూ. వెయ్యి కోట్లకుపైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మద్యం పంపిణీలో ఇబ్బంది లేకుండా స్పెషల్‌ టీంలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలు తెలంగాణలోని లిక్కర్‌ వ్యాపారులకు వరంగా మారుతున్నాయి.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.