మాటల్లో మంత్రం.. వింటేనే ధైర్యం.!
By మధుసూదనరావు రామదుర్గం Published on 2 Aug 2020 12:45 PM GMTకరోనా వైరస్ కంటే భయంకరమైన వైరస్ మనలోని భయం. కరోనా వచ్చిందనో.. వస్తుందనో ఇక మన కథ ముగిసినట్టే అనో విపరీతంగా భయపడు తుంటాం. ముఖ్యంగా వార్తలు విని, చదివి, చూసి.. వారికి కరోనా ఇబ్బంది పెట్టింది, వీరికి కరోనా వస్తే మరో 50 మందికి పాకింది, తుమ్ము, దగ్గు వస్తే చాలు ఇక అయిపోయిందిరా నాయనా అనుకుంటూ హడలెత్తిపోతుంటాం. అసలే దీనికి మందు లేదంటున్నారు. ఆ వ్యాక్సిన్ వచ్చేలోగా ఎలా బతికి బట్టకట్టాలి దేవుడా అనుకుంటూ టెన్షన్ పడిపోతుంటాం.
అలా అనవసరంగా భయపడేవారిలో కొండంత ధైర్యం నింపుతాయి ఆయన మాటలు. కరోనా షురూ అయినప్పటి నుంచి ప్రతిరోజూ టీవీలో సాయంత్రం ఓ మనిషి కనిపిస్తుంటాడు. ఆ మొహంలో ప్రశాంతత ఉంటుంది. కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉంటున్న ఆయన పేరు లవ్ అగర్వాల్.. రోజూ ఆయన మాటలు వినండి గుండెలో ధైర్యం అదంటత అదే వస్తుంది.
దేశంలో ఏదైనా సంక్షోభం తలెత్తినపుడు కొందరు అధికారులు ప్రసారమాద్యమాల్లో తరచూ కనిపిస్తుంటారు. వారి ఉద్యోగ బాధ్యతే అది. అలాంటి వారికే ఎక్కువసార్లు మాట్లాడేందుకు అవకాశముంటుంది. లవ్ అగర్వాల్ సరిగ్గా అలాంటి అధికారే! ఈ ఐఏఎస్ ఆఫీసర్ కేంద్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖలో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
దేశం మొత్తం కరోనా ఉధృతికి హడలెత్తిపోతోంది. ఈ తరం వారు ఇప్పటిదాకా ఇంతటి భయానక వాతావరణం ఇప్పటిదాకా చూడలేదు. ఇలాంటి సమయాల్లో సంబంధిత శాఖ ప్రతినిధులు వళ్ళు దగ్గరపెట్టుకుని ఆచితూచి స్పందించాలి, మాట్లాడాలి. ఏమాత్రం అటుఇటూ అయిందో వ్యవహారం మొత్తం తల్లకిందులవడం ఖాయం. నోరు జారితో కరోనా మాట దేవుడెరుగు అదే పెద్ద వార్తయి పోతుంది. అసలే మెయిన్ మీడియా, సోషల్ మీడియాలు బ్రేకింగ్ న్యూస్‌ల కోసం వళ్ళంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తుంటాయి. అందుకే స్పష్టంగా పక్కా సమాచారాన్ని బాధ్యతగా అందించే అధికారి అవసరం.
కేంద్ర ప్రభుత్వం దీర్ఘదృష్టితో నిరంతరం ఆధికారిక సమాచారాన్ని మీడియాకు అందించే గురుతర బాధ్యతను ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్‌కు అప్పగించింది. అందుకే అగర్వాల్ ఈ కరోనా దాడి సురువైన దరిమిలా ప్రతిరోజూ సాయంత్రం టీవీల్లో ప్రత్యక్షమవుతున్నారు. సమాచారాన్ని ఎలా అందించాలో అలా.. ఎంతమేరకు అందించాలో అంతమేరకు అనవసర భావోద్వేగాలను ప్రదర్శించకుండా తెలియజేస్తున్నారు.
లవ్‌అగర్వాల్ మూలాలేంటి
లవ్ అగర్వాల్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని సహదాన్‌పూర్. తండ్రి ఆడిటర్‌గా ఉంటున్నారు. లవ్ అగర్వాల్ ఇలా రోజూ టీవీలో సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ‘మా ఊరి వారికి నేను ఆడిటర్‌గా తెలుసు. ఎందుకంటే గత నలభైఏళ్ళుగా ఆడిటింగ్ చేస్తున్నాను. ఈ మధ్య నేను బైటవెళుతుంటే.. అదుగో ఆయనే లవ్‌అగర్వాల్ తండ్రి అంటున్నారు. నా కుమారుడు తన బాధ్యతల నిర్వహణలో ఇంత పేరొందడం నాకు చాలా ఆనందంగా ఉంటోంది’ అని తెలిపారు.
ఇవాళ ఐఏస్ అధికారిగా అందరి మన్ననలు అందుకుంటున్న లవ్ అగర్వాల్ మొదట్లో సివిల్ సర్వీస్ అధికారి కావాలనుకోలేదు. తన తండ్రి బాటలో నడిచి సీఏ చేద్దామనుకున్నారు. రోజూ తండ్రి కార్యాలయానికి వెళుతున్న లవ్ అగర్వాల్‌కు ఆ అంకెలు సంఖ్యలు గందరగోళానికి గురిచేశాయి. ఇకలాభం లేదనుకుని ఓ రోజు వాళ్ళ నాన్నతో ‘నేను ఐఐటీ ఎంట్రెన్స్ పరీక్ష రాయాలని నిశ్చయించుకున్నా.. నాకెందుకో ఈ సీఏపై ఆసక్తి రావడం లేద’ని తేల్చి చెప్పాడు. అందుకు ఆయన తండ్రి చిరునవ్వుతో స్పందించి.. అది అంత సులువు కాదు’ అంటూ బదులిచ్చాడు. కానీ లవ్‌అగర్వాల్ మనసు మారలేదు. ‘నేను ప్రయత్నిస్తానన్నాను కదా.. ఒక్క అవకాశం నన్ను టెస్ట్ చేసుకోనివ్వండి’ అన్నాడు. ఆ ప్రయత్నమే అతని జీవితాన్ని మరో మలుపు తిప్పింది.
మొదటి ప్రయత్నంలోనే ఢిల్లీలోని ఐఐటీలో మెకానిక్ ఇంజనీరింగ్ సీటు కొట్టేశారు లవ్ అగర్వాల్. అంతే మరి వెనుదిరిగి చూసుకోలేదు. అనుకున్న లక్ష్యం దిశగా దూసుకుపోయారు. ఇదే విషయంగా అప్పటి కొలీగ్స్‌ను కదిపితే..,‘ లవ్ అగర్వాల్ మాతోపాటు హాస్టల్‌లో ఉండేవాడు. ఎప్పుడూ చదువు పరీక్షలు, మార్కులు వీటిపైనే తన ధ్యాస ఉండేది. కాస్త రిలాక్స్ కావాలనుకున్నప్పుడు సరదాగా ఉండేవాడు. అదీ పరిమిత సమయమే! స్వీయ క్రమశిక్షణతో మెలిగేవాడు. బైకుపై వెళ్లేవాడు. నిజం చెప్పాలంటే మా బ్యాచ్‌మేట్లం అందరం ఆ బైకును యధేచ్చగా వాడేవాళ్లం. అంతటి స్నేహశీలి తను. ఢిల్లీ చదువులయిన వెంటనే విదేశాలకు వెళదామనకున్నాడు. కానీ తండ్రి తనను సివిల్స్ చేయమని ప్రోత్సహించడంతో ఆ దిశగా ప్రయత్నించాడు.
అనుకున్నవి కొందరే సాధించగలరు. చాలా మంది అనుకుంటారు కానీ అలా అనుకునే దశలోనే నీరుగారి పోతుంటారు. కలలు కనడమే కాదు వాటిని నిజం చేసుకోవాలి కూడా అంటారు లవ్ అగర్వాల్. రెండుసార్లు సివిల్స్ ప్రయత్నించారు. కానీ విజయం సాధించలేకపోయారు. ఏమాత్రం నిరాశ చెందకుండా మూడోసారి అంటే 1996లో గట్టి ప్రయత్నం చేశారు. జాతీయస్థాయిలో 21వ ర్యాంకు కొట్టారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కింద హైదరాబాద్‌తోపాటు పలు జిల్లల్లో పనిచేశారు.
తదనరంతరం ఉద్యోగ రీత్యా ఢిల్లీలో కేంద్రవైద్య, కుటుంబ సంక్షేమశాఖలో చేరారు. పనిలో నిక్కచ్చిగా ఉండటం ఎన్ని ప్రాంతాల్లో కొలువు చేసినా వివాద రహితుడిగా పేరుతెచ్చుకోవడం, బాధ్యతలపై గౌరవముంచడంతో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థతో కలిసి పనిచేశారు. కరోనా వచ్చిన తొలిదశలో క్వారంటైన్ పర్యవేక్షణ సమర్థంగా చేయడంతో కేంద్రం కోవిడ్ స్పోక్స్ పర్సన్‌గా నియమించింది. ఈ కరోనా వెళ్ళిపోయినా.. లవ్‌అగర్వాల్ మాత్రం చాలామంది దేశ ప్రజల మనసులో నిలిచి ఉంటారు.