ఎస్పీబీ కరోనా నెగిటివ్ వార్తలపై స్పందించిన తనయుడు చరణ్
By తోట వంశీ కుమార్ Published on 24 Aug 2020 12:05 PM ISTప్రముఖ సింగర్, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని ఆయన తనయుడు చరణ్ సోమవారం వెల్లడించారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై తాజాగా ప్రకటనను విడుదల చేశారు. తాజాగా బాలుకి నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే.. ఆ వార్తల్లో నిజం లేదని చరణ్ చెప్పాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఎస్పీబీ కోలుకోవాలని కొన్ని రోజులుగా ప్రార్థిస్తున్న అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం ఎస్పీ బాలసుబ్రహ్మణానికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. దీంతో ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఫ్లాస్మా థెరపీ కూడా చేశారు. కాగా.. మొదట ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నా.. మధ్యలో కాస్త విషమించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. విదేశీ వైద్య నిపుణులు అందిస్తున్న సూచనల మేరకు ఎస్పీబీకి చికిత్సలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర చికిత్సా విభాగంలో వెంటిలేటర్, ఎక్మో పరికరంతో చికిత్స అందిస్తున్నట్టు వారు వెల్లడించారు. ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.