ఎస్పీ బాలు హెల్త్ అప్‌డేట్.. తనయుడు చరణ్‌ ఏమన్నారంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Aug 2020 12:20 PM GMT
ఎస్పీ బాలు హెల్త్ అప్‌డేట్.. తనయుడు చరణ్‌ ఏమన్నారంటే..?

కరోనా మహమ్మారి బారిన పడిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. రెండు వారాల తర్వాత తన తండ్రిని చూశానని హర్షం వ్యక్తం చేశారు. నిజంగా ఇది బాలూ అభిమానులకు గుడ్ న్యూసే. ఎందుకంటే.. బాలు విషయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అందరూ భయపడిపోతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సంగీత ప్రపంచం చేయని పూజలు లేవు.

"నాన్న నన్ను చూసి గుర్తుపట్టారు. కొద్దిగా మాట్లాడారు. ఎలావున్నారు? అని అడిగితే బొటనవేలు పైకెత్తి చూపించారు. అందరూ చేస్తున్న ప్రార్థనల గురించి వివరించాను. ఆ తర్వాత నేను ఎలా ఉన్నానని అడిగారు. అమ్మ ఎలా ఉందంటూ సైగల ద్వారా అడిగారు. చాలారోజుల తర్వాత నాన్నను చూడడం సంతోషం కలిగిస్తోంది. నన్ను చూసి ఆయన కూడా సంతోషించి ఉంటారని భావిస్తున్నాను. ఇకపై తరచుగా వెళ్లి నాన్నను కలుస్తాను. డాక్టర్లతో మాట్లాడాను. వైద్యుల చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. మీరు చూపిన ప్రేమ, అభిమానం, ఆశీర్వాదానికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది. ఎంజీఎం వైద్యుల బృందం కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్న కోలుకోవడంలో వాళ్లు నిరంతరం కష్టపడ్డారు. త్వరలోనే నాన్న మామూలు స్థితికి వస్తారు. దేశ వ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ బాషల్లో ఆయన వేలాది పాటలు పాడారు. అన్ని భాషల్లో అప్‌డేట్‌ పెట్టడం నాకు కొంచెం కష్టమైన పని. నేను చెప్పేది అర్థం కాని వాళ్లు, ఇంగ్లీష్‌ తెలిసిన వాళ్లను అడిగి తెలుసుకుంటారని ఆశిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు " అంటూ ఎస్పీ చరణ్ వీడియో సందేశంలో తెలిపారు.

Next Story