రెడ్‌హిల్స్‌లోని ఫామ్‌హౌస్‌లో రేపు బాలు అంత్యక్రియలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2020 10:22 AM GMT
రెడ్‌హిల్స్‌లోని ఫామ్‌హౌస్‌లో రేపు బాలు అంత్యక్రియలు

దిగ్గ‌జ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో చ‌ల‌న‌చిత్ర సీమ‌లో విషాదం నెలకొంది. దాదాపు 17 భాషల్లో 42వేల‌ పాటలు పాడిన బాలు మ‌ర‌ణించార‌నే వార్తను ఆయ‌న‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐదు ద‌శాబ్దాల‌కు పైగా ప్లేబ్యాక్ సింగర్‌గా తనన ప్రస్తానాన్ని కొస‌పాగించిన‌ బాలు.. వివిధ విభాగాల్లో 25 నంది పురస్కారాలను అందుకుని అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని దక్కించుకున్నారు.

అగ‌స్టు 5న‌ కరోనా మ‌హ‌మ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ.. అనారోగ్యం మళ్లీ తిరగబెట్టడంతో గురువారం సాయంత్రం నుంచి శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్నాహ్యం ఒంటి గంట నాలుగు నిమిషాల‌కు తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు చరణ్‌ ప్రకటించారు. ఎస్పీ బాలు మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇక‌ మరోవైపు బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నై సమీపంలోని మహలింగపురం కామదార్ నగర్‌లోని ఆయన నివాసానికి మ‌రికొద్దిసేప‌ట్లో ఆయ‌న‌ భౌతిక కాయాన్ని తరలించనున్నారు. శ‌నివారం ఉదయం వరకు స్వ‌గృహం వద్దనే బాలు భౌతికకాయం ఉండనుంది.

ఆ తర్వాత అభిమానుల సందర్శనార్ధం శ‌నివారం ఉదయం ఆయ‌న భౌతిక కాయాన్ని సత్యం థియేటర్‌కు తీసుకెళ్లనున్నారు. ఇక అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక‌ శనివారం మధ్యాహ్నం రెడ్‌హిల్స్‌లోని ఫామ్‌హౌస్‌లో ఆయ‌న‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

Next Story
Share it