నాక్కొంచెం ఎక్కువ మెంటల్ అంటున్న సౌత్ ఇండియా..!
By Newsmeter.Network
ఆధునిక జీవన విధానం పుణ్యమా అని భారతీయుల్లో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయి. అనవసర భయాలు, ఒత్తిడులు, కరువైన మానసిక ప్రశాంతి, జీవితంలో ఏదో కోల్పోయిన భావన, ఉరుకుల పరుగుల జీవితం వంటివన్నీ కలగలిసి మానసిక వ్యాధులు నానాటికీ పెరుగుతూ ఉన్నాయి. సైంటిఫిక్ జర్నల్ లాన్సెట్ తాజా సంచికలో 1990 నుంచి 2017 మధ్య భాగంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో మానసిక సమస్యలపై ప్రచురితమైన పరిశోధనా పత్రం ప్రకారం 2017 నాటికి దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని చెబుతున్నారు. దేశంలో 19.73 కోట్ల మందికి మానసిక సమస్యలున్నాయని వెల్లడైంది. వీరిలో 4.57 కోట్ల మంది డిప్రెషన్ తో, 4.49 కోట్ల మంది ఆంఓళనతో బాధపడుతున్నారని, 1990 తో పోలిస్తే మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రెండింతలైందని కూడా అధ్యయనం తెలిపింది.
ఈ అధ్యయనాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండయాలు నిర్వహించాయి. తెలంగాణలో ప్రధానంగా డిప్రెషన్, మానసిక ఆందోళన చాలా ఎక్కువగా ఉన్నాయని, ఒడిశాలోనూ పరిస్తితి బాగోలేదని ఈ అధ్యయనం చెబుతోంది. తమిళనాడు, కేరళ, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో ఉత్తరాదికన్నా ఎక్కువ మానసిక సమస్యలున్నాయన వెల్లడౌంది. దక్షిణాదిలో డిప్రెషన్ బాధితులు లక్ష మందిలో 3750 మంది వరకూ ఉన్నారని, యాంగ్జైటీ సంబంధిత వ్యాధులు కూడా లక్షమందిలో 3600 మందికి ఉన్నాయని అధ్యయనం తెలిపింది.అదే విధంగా కేరళలో ఇంతకన్నాఎక్కువ మందికి మానసిక వ్యాధులున్నాయి.
ఈ రాష్ట్రాల్లో ఆధునికత, పట్టణీకరణ వంటి కారణాల వల్ల ఒత్తడులు పెరుగుతున్నాయి. దక్షిణాదిలో ఉత్తరాదితో పోలిస్తే ఆత్మ హత్యలు కూడా ఎక్కువే. దక్షిణాదిలో బైపోలార్ వ్యాధులు, ష్కిజో ఫ్రీనియా, పిచ్చి, ఆటిజమం, హైపరాక్టివిటీ డిజార్డర్స్ కూడా ఎక్కువే. అయితే ఉత్తరాది రాష్ట్రాల నగరాల్లో కౌమార్యంలోకి ప్రవేశించిన తరువాత యువతీయువకుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయని అద్యయనం వెల్లడించింది.
ప్రజలలో మానసిక సమస్యల పట్ల అవగాహన కల్పించడం, మానసిన సమస్యల పరిష్కారానికి, చికిత్స కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం అవసరమని కూడా అధ్యయనం లో వాదించడం జరిగింది. చవకధరల్లో చికిత్సను అందుబాటులోకి తేవడం, శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సేవలలో సమన్వయం వంటివి అవసరమని ఈ అధ్యయనం సూచించింది.