మానసిక ఒత్తిడితో క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆటగాడు

By రాణి  Published on  24 Dec 2019 5:44 AM GMT
మానసిక ఒత్తిడితో క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆటగాడు

ఇరవై రెండేళ్ల ఆటగాడు.... క్రికెట్ లో ఫ్యాషనబుల్ ఓపెనర్. తండ్రి శతసహస్ర కోటీశ్వరుడు. కానీ ఆట వల్ల కలిగే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక క్రికెట్ నుంచి అనిర్దిష్ట కాలానికి సెలవు పెట్టేశాడు. ఇది వర్ధమాన క్రికెటర్ ఆర్యమాన్ బిర్లా కథ. ఆయన తండ్రి ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా.

ఆర్యమాన్ మానసిక సమస్యలతో ఆటనుంచి విరామం తీసుకున్నాడు. మానసిక ఒత్తిడులు చాలా మంది ఆటగాల్ల కెరీర్ ను అర్థాంతరంగా ముగిసేలా చేస్తున్నాయి. చాలా మంది కౌన్సెలింగ్ తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ వంటి పేద టీముల్లోనైతే సైకాలజిస్టులు సరే కనీసం మర్దనా చేసే ఫిజియోతెరపిస్టులు సైతం లేరు. ఆర్యమాన్ ది మధ్యప్రదేశ్ టీమే!! క్రికెటర్లపై నేడు చాలా ఒత్తిడులున్నాయి. దేశంలో కోట్ల మంది ప్రజల్లో పదకొండు మందే ఎంపికౌతారు. ఎంపిక కావడమే పెద్ద ఒత్తిడి. ఎంపికైన తరువాత స్థానాన్ని నిలుపుకోవడం రెండో ఒత్తిడి. వీటన్నిటి వల్ల ఆట ప్రభావితమౌతుంది. ఆటలో దెబ్బతింటే అది మనసును దెబ్బ తీస్తుంది. ఇలా ఇదొక విషచక్రం. ఇందులో ఎందరో ఆటగాళ్లు ఒత్తిడితో బాధపడుతున్నారని ప్రముఖ స్పోర్ట్స్ సైకాలజిస్టు ఒకరు చెప్పారు.

ఆర్యమాన్ పరిస్థితి కూడా ఇంతే. ఆయన మధ్యప్రదేశ్ టీమ్ లో చేరినప్పుడు ఆయనపై బిర్లాగారి బిడ్డ అన్న ముద్ర పడింది. ఆ ముద్రను తన ఆట ద్వారా ఆయన చెరిపేసుకున్నాడు. తరువాత తరువాత ఆయనను ఆయనగానే గుర్తించడం మొదలుపెట్టారు. కానీ ప్రతిభ ఉన్నా ఆయన భారత టీమ్ లో స్థానం పొందలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన కన్నా ప్రతిభావంతులు ఇప్పటికే క్యూలో ఉన్నారు. దీంతో ఒత్తిడిపెరిగింది. ఈ ఒత్తిడిని తట్టుకునేందుకే తాను సెలవు తీసుకుంటున్నట్టు ఆర్యమాన్ ఇన్స్టా గ్రామ్ ద్వారా తెలియచేశాడు. మీరట్ క్రికెట్ అకాడెమీని నడిపించే సంజయ్ రస్తోగీ మాత్రం అంత తొందరగా తప్పుకోవద్దని, చాలా మంది ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకుని గెలిచారని చెబుతున్నారు. ఆయన ప్రవీణ్ కుమార్, ప్రియమ్ గర్గ్, భువనేశ్వర్ కుమార్ వంటి ఆటగాళ్లను తయారు చేశారు. ఆయన ఆర్యమాన్ సెలవు తీసుకోవడం పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు.

Next Story