ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఐసిస్ సానుభూతిపరుల కోసం జాతీయ భద్రతా సంస్ధ.. ఎన్ఐఏ జల్లెడ పడుతోంది. కోయంబత్తూరు కారు పేలుడు కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచి తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని 60కి పైగా చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. కోయంబత్తూరు నగరంలో 15 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. కోయంబత్తూరు ఆత్మాహుతి పేలుళ్ల కేసు నిందితుల విచారణలో వచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా ఏకకాలంలో చెన్నై, నాగపట్నం, తిరునల్వేలి జిల్లాల్లో ఎన్‌ఐఏ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది.
2022 అక్టోబర్‌లో కోయంబత్తూరు నగరంలోని కొట్టైమేడు వద్ద సంగమేశ్వర ఆలయం ముందు జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి అరెస్టయిన 11 మంది నిందితులను ఇటీవల ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకుంది. 11 మంది నుండి సేకరించిన వాంగ్మూలాల ఆధారంగా, ఎన్‌ఐఏ అధికారులు ఈ ఉదయం సోదాలు ప్రారంభించారుజ వీడియోల ద్వారా రాడికలైజ్ చేయబడిన అనుమానిత ఐసిస్ సానుభూతిపరులపై ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. కోయంబత్తూర్ పేలుడులో జమీజా ముబీన్ మరణించడంతో అతనితో సంబంధాలున్న వారిని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో ఆటోరిక్షా పేలుడు ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఈ రెండు పేలుడు ఘటనలు ఉగ్రవాదులు చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.