ఆదిశంకరాచార్యపై కేరళ మంత్రి వ్యాఖ్యల దుమారం

Kerala Minister's Comment On Saint-Philosopher Adi Shankaracharya Sparks Row. హిందూ వైదిక తత్వవేత్త, జగద్గురువు ఆది శంకారాచార్యులపై కేరళ మంత్రి, కమ్యూనిస్ట్‌ నాయకులు

By అంజి  Published on  3 Jan 2023 9:35 AM IST
ఆదిశంకరాచార్యపై కేరళ మంత్రి వ్యాఖ్యల దుమారం

హిందూ వైదిక తత్వవేత్త, జగద్గురువు ఆది శంకారాచార్యులపై కేరళ మంత్రి, కమ్యూనిస్ట్‌ నాయకులు ఎంబీ రాజేశ్‌ కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు. ఆదిశంకరాచార్య క్రూరమైన కుల వ్యవస్థకు ప్రతినిధిగా ఉన్నారంటూ కామెంట్‌ చేశారు. శంకరాచార్య, శ్రీ నారాయణ గురుదేవుల మధ్య సమాంతరాన్ని వివరించిన మంత్రి రాజేశ్‌.. శ్రీనారాయణ శంకరాచార్యను విమర్శించారని అన్నారు. కేరళలో శ్రీనారాయణ గురువునే 'ఆచార్య' అని అంటారని శంకరాచార్యులను కాదని అన్నారు. కేరళలోని వర్కాల శివగిరి మఠంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి రాజేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం వివాదానికి కారణమైంది.

శంకరాచార్య మనుస్మృతిపై ఆధారపడిన క్రూరమైన కుల వ్యవస్థను సమర్థించేవారని, అయితే కుల వ్యవస్థను పారద్రోలేందుకు శ్రీనారాయణ గురువు కృషి చేశారని అన్నారు. శంకరాచార్య కుల వ్యవస్థకు మద్దతు ఇవ్వడమే కాకుండా దాని ప్రతినిధిగా కూడా ఉన్నారన్నారు. కుల వ్యవస్థను సమర్ధించిన శంకరాచార్యపై శ్రీనారాయణ గురు విమర్శలు చేశారని రాజేష్ అన్నారు. సమాజంలో కుల వ్యవస్థ వేళ్లూనుకుపోవడానికి శంకరాచార్యులే కారణమని శ్రీనారాయణ గురువు చెప్పారని మంత్రి అన్నారు. కుల వ్యవస్థ ప్రజలను కబళించిందని, దానికి శంకరాచార్యులు కూడా కారణమని శ్రీ నారాయణ గురువన్నారని చెప్పారు.

కాగా మంత్రి రాజేశ్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వీ మురళీధరన్‌ మండిపడ్డారు. ఆదిశంకరాచార్య, శ్రీ నారాయణ గురుదేవులు ఒకే భారతీయ వంశానికి చెందిన వారని అన్నారు. ఎంబీ రాజేష్ హిందూమతంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని మురళీధరన్ ఆరోపించారు. 'సవర్ణ-అవర్ణ మనస్తత్వాన్ని సృష్టించి ఒక వర్గం ఓట్లను పొందేందుకు సీపీఎం ఈ తప్పుడు ప్రచారం చేస్తోందని, శంకరాచార్యను అవమానించే ప్రయత్నాలను నిలువరించాలని కేంద్రమంత్రి అన్నారు.

Next Story