దినేశ్ కార్తిక్ అలా ట్వీట్ చేయడం వెనుక కారణమిదే..?
Dreams do come true tweet Dinesh Karthik.ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో
By తోట వంశీ కుమార్ Published on 13 Sep 2022 8:03 AM GMT
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. అంతా ఊహించినట్లుగానే గాయాలతో జట్టుకు దూరం అయిన జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ లు జట్టులోకి రాగా.. ఆసియాకప్‌లో విఫలం అయిన ఆవేశ్ ఖాన్ పై వేటు పడింది. ఇక పోతే.. ఫినిషర్ కోటాలో ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నాడు దినేశ్ కార్తీక్.
ఈ విషయం తెలిసినవెంటనే దినేశ్ కార్తిక్ ఎమోషనల్ అయ్యాడు. 'కలలు నిజం అవుతాయని' ట్వీట్ చేశాడు. కార్తీక్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటీజన్లు అతడికి ఆల్‌ది బెస్ట్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
Dreams do come true 💙
— DK (@DineshKarthik) September 12, 2022
కాగా.. కార్తిక్ ఇలా ట్వీట్ చేయడానికి ఓ కారణం ఉంది. 2006లో టీమ్ఇండియా తమ తొలి టీ20 మ్యాచ్‌ను సౌతాఫ్రికాతో ఆడింది. ఆ జట్టులో కార్తిక్ సభ్యుడు. అప్పటి నుంచి జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాడు. ఇక 2019 ప్రపంచకప్ అనంతరం జట్టుకు పూర్తిగా దూరం అయ్యాడు. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మాత్రమే ఆడాడు. చివరకు ఆశలు వదిలేసుకొని కామెంటేటర్ అవతారమూ ఎత్తాడు. అయితే.. బెంగళూరు తరుపున ఐపీఎల్ 2022 సీజన్ ఆడడం అతడి తల రాతను మార్చింది. ఫినిషర్‌గా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 37 ఏళ్ల వయస్సులో భారత జట్టులో మళ్లీ చోటు దక్కించుకున్నాడు.
లోయర్ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేస్తుండడంతో ఆసియా కప్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌లోనూ కార్తిక్ కు చోటు దక్కింది. ఐపీఎల్ 2022సీజన్‌లో ఆడుతున్న సమయంలో ఓ ఇంటర్వ్యూలో దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ .. టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఆడటమే తన కోరిక అని చెప్పాడు. తాను ఆశించిన విధంగానే జట్టులో చోటు దక్కడంతో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అలా ట్వీట్ చేశాడు.