ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. శిశువును పీక్కతిన్న కుక్కలు

Baby died after being attacked by dogs in a government hospital. కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ శిశువును వీధి కుక్కలు పాక్షికంగా తినేశాయి.

By అంజి  Published on  8 Sept 2022 3:01 PM IST
ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. శిశువును పీక్కతిన్న కుక్కలు

కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ శిశువును వీధి కుక్కలు పాక్షికంగా తినేశాయి. కుక్కలు దాడి చేయడంతో.. తీవ్రంగా గాయపడిన శిశువు మృతి చెందింది. ఈ ఘటన మాండ్య జిల్లాలో జరిగింది. మాండ్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వార్డు నంబర్‌ 7 సమీపంలో ఒక రోజు వయస్సు కలిగిన పసికందును కుక్కలు పాక్షికంగా పీక్కు తిన్నాయి. పసికందు శరీరాన్ని హృదయ విదారకంగా ఛిద్రం చేశాయి. ఇది గమనించిన అక్కడున్న వారు పసికందును రక్షించే ప్రయత్నం చేశారు.

కాగా కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ నవజాత శిశువు అనంతరం చనిపోయింది. వైకల్యంతో పుట్టిందని ఆ పసికందును తల్లిదండ్రులు ఆస్పత్రి దగ్గరే వదిలేశి వెళ్లారని ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. ఆ శిశువు తమ ఆస్పత్రిలో పుట్టలేదని చెప్పారు. సెప్టెంబర్‌ 1 నుంచి 5వ తేదీ మధ్య పుట్టిన వారిలో నలుగురు శిశువులు మాత్రమే చనిపోయినట్లు వివరించారు. అందులో ముగ్గురు బాబులు, ఒక పాప ఉన్నట్లు తెలిపారు. చనిపోయిన పసిపాపకు అంత్యక్రియలు నిర్వహించినట్లు తల్లిదండ్రులు చెప్పారన్నారు. మిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వదిలిపెట్టిన శిశువు మిమ్స్‌లో పుట్టలేదని ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు.

కుక్కలు దాడి చేసిన శిశువును ఎవరో ఆసుపత్రి వద్ద వదిలేసి ఉంటారని ఆస్పత్రి సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు శిశువును అక్కడ వదిలి వెళ్లిన వ్యక్తి/ల గురించి ఆధారాలను సేకరించేందుకు ఆసుపత్రి వర్గాలు, పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అలాగే పసిపాపపై కుక్కలు దాడి చేసి పాక్షితంగా తినేయడం, తీవ్ర గాయాల వల్ల శిశువు చనిపోయిన సంఘటనపై మాండ్య నగరంలోని వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

Next Story